లైంగిక వేధింపులు జరగలేదు
-ఆరిజన్ డైరీ వ్యవహారంలో తేల్చేసిన మంత్రి కేటీఆర్
-అధిష్టానం నుంచి క్లీన్చిట్ వచ్చినట్లు ఎమ్మెల్యే అనుచరుల ఆనందం
-ఓ చానల్ వీడియో వైరల్ చేస్తున్న అనుచర వర్గం
KTR:బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య వ్యవహారంలో మంత్రి కేటీఆర్ మంగళవారం కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో షేజల్ వ్యవహారంపై స్పందించారు. యాంకర్ షేజల్ విషయమై మంత్రి కేటీఆర్‌ను అడుగుతూ దుర్గం చిన్నయ్య ఎపిసోడ్లో ఏం చర్యలు తీసుకుంటారని ప్రశ్నించారు. దీనిపై మంత్రి స్పందిస్తూ డిల్లీలో తమ ఎంపీలు షేజల్తో మాట్లాడారని ఆమె విషయం మొత్తం తమ ఎంపీలకు చెప్పిందని, అందులో లైంగిక వేధింపులలాంటివి ఏమీ లేవని ఆయన కొట్టిపారేశారు. మీరు తెలుసుకోండని ఆ యాంకర్‌కు బదులివ్వడం గమనార్హం. మాటలు, ఆరోపణలు అడ్డగోలుగా ఆరోపణలు చేయడం కంటే… ఆధారాలతో ఎవరైనా దొరికితే పార్టీ ఖచ్చితంగా చర్యలు తీసుకుంటుందని ఆ ఛానల్ ఇంటర్వ్యూలో మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు.
షేజల్ జాతీయ మహిళా కమిషన్‌ను కలిసి తనను ఎమ్మెల్యే క్వార్టర్లో దుర్గం చిన్నయ్య లైంగిక వేధింపులకు పాల్పడ్డట్టు ఫిర్యాదు చేసింది. వాటికి సంబంధించి పలు ఆధారాలు సైతం సమర్పించినట్లు వెల్లడించింది. ఎన్నోమార్లు వీడియోలు విడుదల చేసిన షేజల్ ఎమ్మెల్యే తనను మందు తాగాలని ఇబ్బందులకు గురి చేశారని, లైంగికంగా వేధించారని ఆరోపించారు. ఢిల్లీ వేదికగా ఆమె ఆందోళనపర్వం కొనసాగించారు. నాలుగు రోజుల కిందట బీఆర్ఎస్ ఎంపీలు ఆమెతో చర్చలు జరిపారు. షేజల్కు న్యాయం చేస్తామని హామీ సైతం ఇచ్చారు. ఈ సమయంలో మంత్రి కేటీఆర్ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
ఇక మంత్రి కేటీఆర్ ఆ చానల్లో ఇచ్చిన ఇంటర్వ్యూను బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య అనుచరులు పెద్ద ఎత్తున వైరల్ చేస్తున్నారు. తమ నేతకు క్లీన్ చిట్ ఇచ్చారని ఇక బెల్లంపల్లి టిక్కెట్టు తమకేనని, గెలుపు సైతం తమదేనంటూ సోషల్‌మీడియాలో హోరెత్తిస్తున్నారు. ఎన్నో రోజులుగా ఈ విషయంలో పోరాటం చేస్తున్న షేజల్ వర్గం ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.