రెండు రోజుల్లో సర్కారు అవినీతి బయటపెడతా..
-కాంగ్రెస్ పార్టీ మాయమాటలతో మోసం చేస్తోంది
-రైతు కూలీలకు ఏడాదికి 12 వేలు ఇస్తామన్నారు..? ఏమైంది..?
-కౌలు రైతులకు ఇవ్వాల్సిన మొత్తం రూ. 35 వేల కోట్లు బాకీ పడ్డారు
-1.38 లక్షల కోట్ల రూపాయలు అప్పు తెచ్చి.. ఏం చేశారు..?
-కాంగ్రెస్ ప్రభుత్వంపై బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి ఫైర్
BJLP leader Eleti Maheshwar Reddy: “తెలంగాణలో వేల కోట్ల కుంభకోణాలు జరుగుతున్నాయి.. మరో రెండ్రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వ అవినీతి కుంభకోణాన్ని బయట పెట్టబోతున్నా.. అందులో ఉన్న మంత్రుల హస్తాన్ని కూడా పూర్తి ఆధారాలతో బయట పెడతాం.. నాకు చాలా ఆధారాలు దొరికాయని” బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి వెల్లడించారు. ఆయన గురువారం బీజేపీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో హామీలు ఇచ్చిందని వాటిని అమలు చేయడం మర్చిపోయిందని ఆయన దుయ్యబట్టారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి సంవత్సరం గడిచిపోయిందని, అయినా ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేదన్నారు. గత ఏడాది ఎగవేతల నామ సంవత్సరంగా ముగిసిందని ఎద్దేవా చేశారు.
గత ఖరీఫ్ లో రైతు భరోసా ఇవ్వలేదు. ఇప్పుడు రబీ సీజన్ లో అయినా ఇస్తారా..? మాయమాటలతో మోసం చేయడం తప్పా.. వారికి మంచి చేసే ఆలోచన కాంగ్రెస్ కు ఉందా? అని ప్రశ్నించారు. ఉప ముఖ్యమంత్రి భట్టి స్వయంగా రైతు కూలీలకు ఏడాదికి 12 వేలు ఇస్తామని మాట ఇచ్చారు. ఆ మాట ఇచ్చి డిసెంబర్ 28తోనే ఏడాది దాటిపోయిందన్నారు. వారికి ఇవ్వకుండా ఆయన్ను అడ్డుకునేది ఎవరు.? లేకపోతే ఆ డబ్బులు మరెవరికైనా కాంట్రాక్టర్లకు ఇచ్చేందుకు దాచారా..?మంత్రి పొంగులేటి కూడా ఇదే మాట ఇచ్చారు.. ఏమైంది? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు.
రైతు భరోసాపై కమిటీ ఏర్పాటు చేసి 15 రోజుల్లో నివేదిక ఇస్తామన్నారు.. ఈ కమిటీ ఏర్పడి 4, 5 నెలలు దాటిందని, అయినా దానికి సంబంధించిన విధివిధానాలు ఎందుకు ఇవ్వలేకపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 4న జరిగే కేబినెట్ భేటీలో రైతు భరోసాపై చర్చించి నిర్ణయం తీసుకోవాలన్నారు. ఎప్పటిలోగా ఇస్తారో తేదీ కూడా అదే రోజు ప్రకటించాలని ఏలేటీ డిమాండ్ చేశారు. 15 వేల చొప్పున ఇవ్వాలంటే ఒక్క సీజన్ కు 23 వేల కోట్లు చెల్లించాల్సి ఉంది.. రెండు సీజన్లకు కలిపి 46 వేల కోట్లు బకాయి ఉందని కానీ సర్కార్ బడ్జెట్ లో 15 వేల కోట్లు మాత్రమె కేటాయించిందని, మిగిలినవి ఎలా ఇస్తారో కాంగ్రెస్ సర్కార్ సమాధానం చెప్పాలన్నారు.
ముఖ్యమంత్రి ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ కౌలు రైతులకు 12 వేలు ఇవ్వడం కుదరదు అన్నట్లుగా మాట్లాడారని, కౌలు రైతులు.. యజమానితో మాట్లాడుకోవాలని చెప్పడం సిగ్గుచేటని దుయ్యబట్టారు. కౌలు రైతులకు 12 వేలు ఇవ్వకుండా ఎగ్గొట్టాలనే కదా కాంగ్రెస్ ఆలోచన అని మహేశ్వర్‌రెడ్డి స్పష్టం చేశారు. కౌలు రైతులకు మొండిచేయి చూపకండి. వారిని గుర్తించి ఐడీ కార్డులు ఇవ్వండని హితవు పలికారు. రైతు భరోసా, కౌలు రైతులకు ఇవ్వాల్సిన మొత్తం 35 వేల కోట్లు కాంగ్రెస్ బాకీ పడిందన్నారు. ఉపాధిహామీ కూలీలకు కూడా ఏడాదికి 12 వేలు వారి ఖాతాల్లో వేస్తామన్నారు.. కేబినెట్ మీటింగ్ ఎజెండాలో దీన్ని పెట్టా లన్నారు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 390 రోజులు అయిందని, ఇప్పటి వరకు 1.38 లక్షల కోట్ల రూపాయలు అప్పు తెచ్చిందన్నారు. అంటే రోజుకు 354 కోట్ల అప్పు.. గంటకు 14 కోట్ల 70 లక్షల అప్పు అన్నారు. FRBM పరిధి దాటి కేంద్ర ప్రభుత్వాన్ని సైతం కాంగ్రెస్ మోసం చేసిందని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ఇచ్చిన ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని, మరి ఆ అప్పులు తెచ్చి ఎవరికి ఇచ్చారు? అని ఏలేటి మహేశ్వర్ రెడ్డి ప్రశ్నించారు. 20 వేల కోట్లను మాత్రమే రుణమాఫీకి కేటాయించారని.. మిగతా 1,18,000 వేల కోట్లు ఎవరి కోసం ఖర్చు చేశారని అన్నారు. ఈ డబ్బంతా బడా గుత్తేదారులకు చెల్లించేందుకు ఖర్చు చేశారని అన్నారు.