తుపాకీ మిస్‌ఫైర్.. హెడ్‌కానిస్టేబుల్ మృతి

Miss Fire: తుపాకీ మిస్ ఫైర్ అయి ఓ హెడ్ కానిస్టేబుల్ మృతి చెందిన ఘటన హైదరాబాద్‌లో చోటు చేసుకుంది. ఖైరతాబాద్ మింట్ కాంపౌండ్ లో స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ హెడ్ కానిస్టేబుల్ రామయ్య ప్రింటింగ్ ప్రెస్ దగ్గర సెక్యూరిటీ విధులు నిర్వహిస్తున్నాడు. గురువారం తుపాకీ శుభ్రం చేస్తుండగా మిస్ ఫైర్ అయి రామయ్య మరణించినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. అనంతరం మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.
కాగా, రామయ్యది మంచిర్యాల జిల్లా లక్షేట్టీ పేట మండలం ఇటిక్యాల గ్రామం. ఆయన మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.