బీఆర్ఎస్… బీజేపీ బంధువుల పార్టీ

Rahul Gandhi: బీఆర్‌ఎస్ అంటే బీజేపీ రిస్తేదార్ పార్టీ (బీజేపీ బంధువుల పార్టీ) అని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. ఆదివారం ఖమ్మంలో జరిగిన జనగర్జన సభలో ఆయన ప్రసంగిస్తూ మోడీ చేతిలో కేసీఆర్ రిమోట్ ఉందన్నారు. సీఎం కేసీఆర్ అవినీతికి ప్రధాని మోడీ అండదండలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ధరణి ద్వారా ముఖ్యమంత్రి భూములను, మిషన్ భగీరథలో వేల కోట్లు దోచుకున్నారని దుయ్యబట్టారు. రైతులు, దళితులు, ఆదివాసీలు ఇలా అన్ని వర్గాలను కేసీఆర్ దోచుకుంటున్నారని రాహుల్ ఆరోపించారు. పార్లమెంట్‌లో కాంగ్రెస్ పార్టీ బీజేపీకి వ్యతిరేకంగా పోరాడుతోందని.. కానీ బీఆర్ఎస్ బీజేపీకి బీ టీమ్‌గా పనిచేస్తోందని ఆరోపించారు. రైతు చట్టాల బిల్లును కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తే.. బీఆర్ఎస్ మద్ధతు పలికిందని రాహుల్ గాంధీ గుర్తుచేశారు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక చేయూత పథకం ద్వారా వృద్ధులకి, వితంతువులకు రూ.4000 పెన్షన్ ఇస్తామని రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. ఆదివాసీలకు పోడు భూములు ఇచ్చేస్తామని వెల్లడించారు. కర్ణాటకలోనూ అవినీతి ప్రభుత్వం వుందని.. అక్కడ కాంగ్రెస్ పార్టీకి ప్రతి కుటుంబం అండగా నిలబడి వుందని ఆయన తెలిపారు. తెలంగాణలోనూ ఇదే జరుగుతుందని రాహుల్ జోస్యం చెప్పారు. తెలంగాణలో బీజేపీ ఖతమైపోయిందని.. ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్‌కి మధ్యే పోటీ అన్నారు. ఇటీవల పాట్నాలో విపక్ష పార్టీల సమావేశం జరిగిందని.. దీనికి బీఆర్ఎస్‌ను ఆహ్వానించాలని అనుకున్నారని చెప్పారు. కానీ, బీఆర్ఎస్ పార్టీ వస్తే తాము రామని చెప్పామని రాహుల్ స్పష్టం చేశారు.
కేసీఆర్ తెలంగాణకు రాజులా భావిస్తాడని, రాష్ట్రాన్ని జాగీరులా ఫీలవుతాడని రాహుల్ మండిపడ్డారు. ఇందిరాగాంధీ ప్రభుత్వం నిరుపేదలకు, గిరిజనులకు ఇచ్చిన భూములను కేసీఆర్ లాక్కుంటున్నారని ఆరోపించారు. ఈ భూముల విషయం భారత్ జోడో యాత్రలో తన దృష్టికి తీసుకొచ్చారని.. ఈ భూములు కేసీఆర్‌వి కావని మీవని రాహుల్ చెప్పారు. ముఖ్యమంత్రి అవినీతి పరాకాష్టకు చేరిందని.. కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో లక్ష కోట్ల అవినీతి జరిగిందన్నారు.