ఈటల, డీకే గృహనిర్బంధం
Etala Rajender: తెలంగాణ బీజేపీ ఎన్నికల నిర్వహణ కమిటీ ఛైర్మన్, హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ను పోలీసులు గృహనిర్బంధం చేశారు. హైదరాబాద్‌లో ఆయనను హౌస్ అరెస్టు చేసినట్లు వెల్లడించారు. హైదరాబాద్ శివారు అబ్దుల్లాపూర్‌మెట్ మండల పరిధిలోని బాటసింగారంలో నిర్మించిన డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణాలను ఇవాళ పరిశీలిస్తామని బీజేపీ నేతలు ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రజాసమస్యలను గుర్తించటంలో భాగంగా బీజేపీ ఈ కార్యక్రమానికి పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో బీజేపీ ఎమ్మెల్యే ఈటల సహా పలువురు నేతలను పోలీసులు ముందస్తుగా హౌజ్ అరెస్టు చేశారు. ఈటలతో పాటు డీకేఅరుణ, పలువురు సీనియర్ బీజేపీ నేతలను పోలీసులు హౌజ్ అరెస్ట్ చేశారు. జంటనగరాల్లో వరుసగా ఈ హౌస్ అరెస్టులు చేసినట్లు తెలుస్తోంది.
తమను గృహ నిర్బంధం చేయడంపై బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ నియంతలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కేసీఆర్ ఖూనీ చేస్తున్నారని ఫైర్ అయ్యారు. తెలంగాణ సర్కార్ ప్రశ్నించే గొంతుకలను నొక్కేందుకు ప్రయత్నిస్తోందని దుయ్యబట్టారు. డబుల్ బెడ్రూం పేరుతో బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజల సొమ్ము వృథా చేస్తోందని ఆరోపించారు. నిజంగా కేసీఆర్ ప్రభుత్వం ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వమే అయితే తమను రెండు పడక గదుల ఇళ్లను పరిశీలించేందుకు ఎందుకు వెళ్లనీయడం లేదని ప్రశ్నించారు.