నా హత్యకు కుట్ర
Jogu Ramanna: కాంగ్రెస్ నేత కంది శ్రీనివాస్‌రెడ్డి పద్ధతి, సంస్కారం లేకుండా మాట్లాడుతున్నారని ఆదిలాబాద్ ఎమ్మెల్యే దుయ్యబట్టారు. ఆయన శనివారం క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. గ్రామాల్లో తిరుగుతూ తనను పరోక్షంగా హత్య చేయాలని పిలుపునివ్వడం, ఆ విధంగా ప్రోత్సహించడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. పరోక్షంగా హత్య చేయాలని ప్రోత్సహించడంపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని, ఆయా గ్రామాల్లోని పోలీస్ స్టేషన్ల పరిధిలో ఫిర్యాదు చేస్తామన్నారు. తాను మహారాష్ట్రలో వేలాది ఎకరాల భూమి కొన్నా అని, ఐదు వేల కోట్ల డబ్బులు జమ చేశానని ఆరోపిస్తున్నాడని, అవన్నీ రుజువు చేయాలన్నారు. తన మీద, తన కుటుంబ సభ్యుల మీద ఆరోపణలు చేస్తున్నాడన్నారు. శ్రీనివాస్ రెడ్డిపై పరువు నష్టం దావా వేస్తామమని హెచ్చరించారు. న్యాయస్థానంలో ఆరోపణలు రుజువు చేస్తే ఏ శిక్షకైనా సిద్ధమన్నారు. తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని అన్నారు. రుజువు చేయని పక్షంలో అమెరికా పారిపోతవా..? అని ప్రశ్నించారు.
కేవలం జోగురామన్నను వ్యక్తిగతంగా, కుటుంబ పరంగా మాట్లాడితే పెద్ద నాయకుడిని అవుతా, టికెట్ వస్తుంది అని ఉద్దేశ్యంతో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడని దుయ్యబట్టారు. గ్రామశాఖ అధ్యక్ష పదవి నుండి ప్రజలు నన్ను ఈ స్థాయికి తీసుకువచ్చారని స్పష్టం చేశారు. నా వ్యక్తిత్వం ఏంటో ప్రజలకు కూడా తెలుసని ఈ సందర్భంగా వెల్లడించారు. డబ్బులతో ప్రజల ఓట్లు కొనలేరని హితవు పలికారు. ఇప్పటికైనా నోరు అదుపులో పెట్టుకో, పద్ధతి నేర్చుకో అని జోగు రామన్న హెచ్చరించారు. ఈ సమావేశంలో జిల్లా రైతు సమన్వయ అధ్యక్షులు రోకండ్ల రమేష్,పట్టణ అధ్యక్షులు అజయ్,అధికార ప్రతినిధి గంగారెడ్డి, కౌన్సిలర్ భరత్, రామ్ కుమార్, నాయకులు, సాజి తోద్దీన్, ప్రశాంత్, తదితరులు పాల్గొన్నారు.