నిలిచిన ఆర్టీసీ బస్సులు

TSRTC: తెలంగాణ వ్యాప్తంగా ఆర్టీసీ బస్సులు శనివారం ఎక్కడిక్కడ నిలిచిపోయాయి. ఉదయం ఆరు గంటల నుంచే కార్మికులు బస్సులు నిలిపి ఆందోళన చేస్తున్నారు. దీంతో బస్సులు డిపోలకే పరిమితం అయ్యాయి. టీఎంయూ (TMU) పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడికక్కడ బస్సులు నిలిపివేశారు. గవర్నర్ వైఖరిని నిరసిస్తూ డిపోల ముందు ధర్నా నిర్వహిస్తున్నారు. TSRTCని ప్రభుత్వంలో విలీనం చేసే బిల్లుపై గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆమోదం తెలుపలేదు. గవర్నర్ ఆమోదం తెలిపితే.. ఆ బిల్లు అసెంబ్లీలో ప్రవేశపెట్టాల్సి ఉన్నది. కానీ, బిల్లును పంపి రెండు రోజులైనా ఇంకా ఆమోదం తెలుపకపోవడంతో ఆర్టీసీ కార్మికులు బస్సు బంద్‌కు పిలుపు ఇచ్చారు.
మంచిర్యాల, ఆదిలాబాద్, కొమురంభీమ్ ఆసిఫాబాద్, సిద్దిపేట, బోధన్, కామారెడ్డి, భూపాల పల్లి, వరంగల్ డిపోల ఎదుట కార్మికుల నిరసన కొనసాగుతోంది. రెండు గంటల పాటు నిరసన వ్యక్తం చేయనున్నకార్మికులు, ఆ తర్వాత రాజ్‌భవన్ ముట్టడించనున్నారు.