ఆర్టీసీ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం
TSRTC:తెలంగాణ ఆర్టీసీ విలీన బిల్లుకు అసెంబ్లీ ఆమోదం తెలిపింది. రాష్ట్ర గవర్నర్ తమిళిసై (Governer Tamilisai) ఆమోదం తర్వాత అసెంబ్లీకి వచ్చిన ఈ బిల్లును ఆదివారం సాయంత్రం మంత్రి పువ్వాడ అజయ్ ప్రవేశపెట్టారు. మెజార్టీ శాసన సభ్యులు బిల్లును ఆమోదించడంతో ఆర్టీసీ ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగులుగా మారేందుకు ముందడుగు పడింది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆర్టీసీ ఆస్తులు కార్పొరేషన్ ఆధీనంలోనే ఉంటాయని స్పష్టం చేశారు. ఉద్యోగుల విలీనం వల్ల ప్రభుత్వంపై ఏటా 3 వేల కోట్ల భారమని చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగులకు వర్తించే పీఆర్సీ ఆర్టీసీ ఉద్యోగులకు వర్తిస్తుందని చెప్పారు. ఆర్టీసీ ఉద్యోగులు సర్వీసులోనే కొనసాగుతారని మంత్రి తెలిపారు.
ఆదివారం మధ్యాహ్నం ఆర్టీసీ విలీన బిల్లుకు గవర్నర్ ఆమోద ముద్ర వేశారు. ఉన్నతాధికారులతో చర్చించిన అనంతరం తమిళిసై ఎట్టకేలకు బిల్లను ఆమోదించారు. గవర్నర్ అనుమతితో ఆర్టీసీ విలీన బిల్లుకు అడ్డంకులు తొలగిపోయాయి. ఆర్టీసీ విలీన బిల్లు రెండు రోజులుగా గవర్నర్ పెండింగ్‌లో ఉంచడంతో ఆర్టీసీ ఉద్యోగులు, కార్మిక సంఘాలు రోడ్డెక్కాయి. రాజ్‌భవన్ ముట్టడికి పిలుపునిచ్చారు. ఆ తర్వాత విలీనంపై ప్రభుత్వానికి గవర్నర్ 5 ప్రశ్నలు సంధించారు. కార్మిక సంఘాల నేతలతో వీడియో కాన్ఫరెన్స్‌లో చర్చించారు. ప్రభుత్వం నుంచి ఆ ప్రశ్నలకు వివరణ రావడం.. మరికొన్ని సందేహాలను వ్యక్తం చేస్తూ తమిళిసై మరోసారి ప్రభుత్వానికి లేఖ రాశారు. ఆదివారం ఉదయం నుంచి ఈ బిల్లుపై పెద్ద రచ్చే జరిగింది. ఆఖరికి గవర్నర్ ఆమోదించడం.. ఇటు ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టడం మెజార్టీ శాసన సభ్యులు ఆమోద ముద్ర వేయడంతో.. ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగులుగా మారేందుకు మార్గం సులువైంది.