మూడు బృందాలు… ముచ్చెమటలు…

Mancharyala murder: మంచిర్యాలలో వివాహిత శరణ్యను హత్య చేసిన నిందితులు పోలీసులకు అస్సలు చిక్కుండా తప్పించుకుంటున్నారు. పోలీసులు ఎంత ప్రయత్నాలు చేసినా చిటికెలో తప్పించుకుని మాయం అవుతున్నారు. ఖాకీలు సైతం అంతే పట్టుదలగా వారిని పట్టుకునేందుకు ముందుకు సాగుతున్నారు.
మంచిర్యాలలో ప్రైవేట్ ఆసుపత్రిలో రిసెప్షనిస్ట్‌గా పనిచేస్తున్న బన్ని శరణ్య(27) గురువారం సాయంత్రం హత్యకు గురైన విషయం తెలిసిందే. ఆసుపత్రిలో పనిచేస్తున్న ఆమె విధులు ముగించుకుని తిరిగి వస్తుండగా, రైల్వే స్టేషన్ సమీపంలోని క్యాబిన్ వద్ద కత్తితో పొడిచి, నరికేశారు. బండలతో మోది మరీ దారుణంగా హత్య చేశారు. ఈ హత్య భర్తే చేయించాడని భావించిన పోలీసులు హత్య చేసిన నిందితుల కోసం గాలిస్తున్నారు. పోలీసు అధికారులు ఈ మేరకు మూడు బృందాలను ఏర్పాటు చేసి నిందితుల కోసం వల పన్నారు. ఒక బృందం హైదరాబాద్‌లో, మరో బృందం విశాఖపట్నం ఇలా నిందితులు తప్పించుకోకుండా తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు.
ఫోన్ వాడకుండా… ఫేస్బుక్ ద్వారా కాల్స్..
నిందితులు చాలా తెలివిగా తప్పించుకుంటున్నారు. ఓ వైపు వారిని పోలీసులు వెంబడిస్తుండగా, మరోవైపు వారు చాలా జాగ్రత్తలు పాటిస్తున్నారు. అందులో ముఖ్యంగా నిందితులు ఫోన్ వాడటం లేదు. పైగా రైళ్లలో తిరుగుతూ దొరక్కుండా తప్పించుకుంటున్నారు. స్టేషన్లలో, హోటళ్ల వద్ద పక్కవారి దగ్గర నుంచి ఫోన్ తీసుకుని వారి ఫోన్లో ఫేస్బుక్ లాగిన్ అయ్యి కాల్స్ చేసుకుంటున్నారు. దీంతో వారిని పట్టుకోవడం పోలీసులకు కష్టంగా మారుతోంది. అయినా వారిని ఎట్టి పరిస్థితుల్లో పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు.
రంగంలోకి మరో బృందం..
పోలీసు అధికారులు ఇప్పటికే మూడు బృందాలను ఏర్పాటు చేయగా, మరో బృందాన్ని రంగంలోకి దించుతున్నారు. రెండు రోజుల్లో ఎట్టి పరిస్థితుల్లో వారిని పట్టుకోవాలని భావిస్తున్నారు. కేసు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసు అధికారులు ఇప్పటికే లక్షకు పైగా ఖర్చు చేశారంటే అర్ధం చేసుకోవచ్చు. ఏమైనా సరే వారిని పట్టుకుని రెండు రోజుల్లో అరెస్టు చూపించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు.
గంజాయి మత్తులోనే హత్య….
నిందితులు హత్య చేసింది గంజాయి మత్తులోనే పోలీసులు గుర్తించినట్లు సమాచారం. కత్తులతో మెడపై నరికి, బండలతో మోది మరి హత్య చేశారు. ఇలాంటి సమయాల్లో నిందితులు మద్యం సేవించో, లేక వేరే ఇతర మత్తు పదార్థాలు తీసుకుని ఇలాంటి హత్యలు చేస్తుంటారు. శరణ్య విధులు ముగించుకుని వస్తున్న క్రమంలో ఆమెను వెంబడించిన దుండగులు రైల్వే క్యాబిన్ వరకు వచ్చాక దారుణంగా హత్య చేశారు. హత్య సమయంలో వారు గంజాయి తాగి తీసుకున్నట్లు చెబుతున్నారు.