ఇటుక బట్టీల్లో కాలుతున్న ‘మాన’వత్వం
-మహిళలపై పెరుగుతున్న అత్యాచారాలు
-సామూహిక మానభంగాలు చేస్తున్నా పట్టించుకున్న నాథుడే లేడు
-కూలీలకు న్యాయం చేయడంలో కార్మిక శాఖ విఫలం
-డబ్బులు దండుకుంటూ కండ్లు మూసుకుంటున్న వైనం
-అన్ని శాఖల సమన్వయంతోనే వలస కూలీలకు న్యాయం
Increasing rape of women:ఆకలి తాళలేక పొట్ట చేతపట్టుకుని వలస వచ్చిన కూలీలు వారు… రెక్కల కష్టాన్ని నమ్ముకుని కట్టుకున్న వారికి, పిల్లలకు ఇంత తిండి పెట్టాలనే తపన వారిది.. రెక్కాడితే కానీ, డొక్కాడని దుస్థితి నుంచి ఎంతో సంపాదించుకోవాలనే తపనతో వస్తారు… పొట్ట చేతపట్టుకొని రాష్ట్రాలు దాట వచ్చిన వారిపై కొందరు కామాంధులు కన్నేస్తున్నారు. ఏం చేయలేరనే ధీమాతో అత్యాచారాలకు పాల్పడుతున్నారు. కొన్ని బయటకు వస్తుండగా, మరికొన్ని ఇటుకబట్టీల్లోనే సమాధి అవుతున్నాయి.
వలస కూలీలపై అత్యాచార ఘటనలు నిత్యం వెలుగులోకి వస్తున్నాయి. పని కోసం రాష్ట్రలు దాటి వస్తున్న వారిపై యజమానులు ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తున్నారు. దీంతో వలసకూలీలు ఎక్కడికి వెళ్లలేక ఇక్కడ ఉండలేక నరకం అనుభవిస్తున్నారు. పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల్లో పెద్ద ఎత్తున ఇటుక బట్టీలు ఉంటాయి. ఇక్కడ పనిచేసేందుకు బీహార్, బెంగాల్, ఒడిషా, చత్తీస్ ఘడ్ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున కూలీలు వస్తుంటారు. కూలీ చౌకతో పాటు, కష్టపడి పనిచేసే మనస్తత్వం ఉన్న వారు కావడంతో వారికి ఇక్కడకు రప్పిస్తారు. అయితే కొందరు యజమానులు వారి పట్ల అమానుషంగా ప్రవరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అందులో కొందరు మహిళలను లోబర్చుకోవడం, వినకపోతే అత్యాచారాలు చేయడం లాంటివి చేస్తున్నారు. చాలా సందర్బాల్లో అవి బయటకు రాకుండా తొక్కిపెడుతున్నారు.
-రెండు రోజుల కిందట జరిగిన ఘటన కలకలం రేపుతోంది. పెద్దపల్లి జిల్లా అప్పన్నపేటకు మధ్యప్రదేశ్ కు చెందిన ఓ కుటుంబం కూలీలుగా వలస వచ్చారు. ఆ కుటుంబానికి చెందిన 16 ఏండ్ల మైనర్ బాలికను నలుగురు వ్యక్తులు గ్యాంగ్ రేప్ చేశారు. తీవ్రంగా గాయపడిన బాలికను ప్రైవేటు వాహనంలో మధ్యప్రదేశ్ తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందింది.
-ఇదే జిల్లా గౌరెడ్డిపేట గ్రామంలో ఐదుగురు యజమానులు సామూహిక అత్యాచారానికి గతేడాది ఫిబ్రవరిలో వివాహితపై ఐదుగురు యజమానుల గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డారు. తప్పించుకుని పారిపోతున్న భార్యాభర్తల్ని బంధించి మరీ మహిళపై దారుణ అఘాయిత్యానికి ఒడిగట్టారు. ఇటుక బట్టీలో పనిచేసే ఒడిశాకు చెందిన వివాహిత (22) పై ఐదుగురు యజమానులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం దంపతులపై దాడి చేశారు. తమకు ప్రాణహాని ఉందని భావించిన ఆ దంపతులు అక్కడి నుంచి తప్పించుకుని స్వగ్రామం వెళ్లేందుకు రామగుండం రైల్వే స్టేషన్‌కు వెళ్లారు. వారిని పట్టుకున్న యజమానులు మళ్లీ ఇటుక బట్టీల వద్దకు తీసుకెళ్లి తీవ్రంగా కొట్టారు. సాక్ష్యం చెబుతారనే ఉద్దేశంతో మరో 14 మంది కూలీలను నిర్బంధించి దాడి చేశారు. అయితే ఈ విషయాన్ని గుర్తు తెలియని వ్యక్తులు మానవ హక్కుల సంఘానికి లేఖ రాశారు. స్పందించిన హెచ్చార్సీ విచారణకు ఆదేశించింది. అప్పుడు కానీ స్థానికంగా ఉన్న అధికారులు కదలేదు.
– 2015 సంవత్సరంలో ఇటుక బట్టీ కూలీల గుమాస్తా కొట్టిన దెబ్బలకు పని చేసేందుకు వచ్చిన గర్భిణీ ప్రాణాలు కోల్పోయింది. పెద్దపల్లి మండలం హన్మంతునిపేటలో ఈ దారుణం చోటుచేసుకుంది. ఒడిశాకు చెందిన కొందరు కూలీలు హన్మంతునిపేట సమీపంలోని ఇటుకబట్టీల్లో పనిచేసేందుకు వచ్చారు.కాగా గురువారం మధ్యాహ్నం పని వేళలో అలసిపోయి కూర్చున్న నిండు గర్భిణీ సుర్ణజారు(25)పై ముఠా మేస్త్రీ ఉద్దవ్ విచక్షణ మరచి చేయిచేసుకున్నాడు. పొట్టపై బలంగా తన్నడంతో తీవ్ర అస్వస్థతకు గురైన ఆమె మృతి చెందింది.
– ఈ ఏడాది ఫిబ్రవరిలో సంగారెడ్డి జిల్లాలోని దర్గా తండాలో దారుణం చోటుచేసుకుంది. ఏడుగురు బాలికలను ఇటుక బట్టీ యజమాని లైంగికంగా వేధించాడు. లైంగికంగా వేధించడమే కాకుండా జీతం ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేేశాడు. బాధితులందరూ ఒడిశాకు చెందిన మైనర్ బాలికలు. లైంగిక వేధింపుల వ్యవహారంపై ఇసుక బట్టీ కార్మికులు ఒడిశా సీఎస్‌కు ఫిర్యాదు చేశారు. ఇటుక బట్టీ కార్మికుల ఫిర్యాదుతో దీనిపై చర్యలు తీసుకోవాల్సిందిగా తెలంగాణ కార్మిక శాఖను ఒడిశా సీఎస్ కోరారు. ఒడిశా సీఎస్ సూచనతో తెలంగాణ కార్మికశాఖ రంగంలోకి దిగిం 72 మంది కార్మికులకు విముక్తి కలిగించింది.
– 2019లో రంగారెడ్డి జిల్లా మంచాల మండల పరిధిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఒడిషా రాష్ట్రానికి చెందిన ఓ కుటుంబం ఉపాధి నిమిత్తం హైదరాబాద్‌కు వలస వచ్చారు. తల్లిదండ్రులతో పాటు 14ఏళ్ల బాలిక కూడా బోడకొంట గ్రామ సమీపంలోని ఓ ఇటుక బట్టీలో పనికి కుదిరారు. అదే గ్రామ శివారులో ఓ గుడిసె వేసుకుని అందులోనే నివాసం ఉంటున్నారు. ఆ బాలికపై కొందరు అత్యాచారానికి పాల్పడగా కేసు కప్పిపుచ్చే ప్రయత్నం చేశారు. అయితే, పోలీసులు ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకుని కేసు నమోదు చేశారు.
ఇటుక బట్టీలపై సరైన నిఘా లేకపోవడం వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అసలు ఇటుకబట్టీలు ఎన్ని…? అందులో పనిచేసే కార్మికులు ఎంత మంది..? వఆరి వారికి వర్తించాల్సిన పథకాలు, ఇతర సౌకర్యాలు అందుతున్నాయా..? లేదా అని కార్మిక శాఖ అధికారులు పట్టంచుకోవాలి. కానీ, ఇటుక యజమానుల వద్ద నిత్యం లంచాలు దండుకుంటున్న అధికారులు అటువైపుగా దృష్టి సారించడం లేదు. పోలీసు శాఖ అప్పుడప్పుడు సమావేశాలు నిర్వహిస్తున్నా ఇంకా నిఘా పెంచాల్సిన అవసరం ఉందని పలువురు స్పష్టం చేస్తున్నారు.
అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తేనే వలస కూలీల వ్యథ తీరుతుంది. వారి తలరాత మారుతుంది. లేకపోతే వారి బతుకులు ఇలా నిత్యం చితికిపోవాల్సిందే..