హాలీవుడ్ సినిమాల కంటే తక్కువ ఖర్చు..!
Chandrayaan-3: కోట్లాది మంది గుండె చప్పుళ్లు నిజం చేస్తూ భారత్ చరిత్ర సృష్టించింది. మిషన్ చంద్రయాన్-3 (Chandrayaan-3) విజయవంతంతో తన కీర్తి పతాకలు రెపరెపలాండిచింది. ఈ క్షణం కోసం యావత్ భారతంతో పాటు ప్రపంచ దేశాలు ఆతృతగా ఎదురుచూశాయి. దక్షిణ ధృవంపై ల్యాండింగ్ చేసిన తొలి దేశంగా కీర్తి పుటల్లో నిలిచింది.
అయితే, చంద్రయాన్ 3 ప్రాజెక్టు బడ్జెట్ ఎంత..? ఎంత ఖర్చు చేశారనేదానిపై పలువురు ఆసక్తి కనబర్చుతున్నారు. విదేశాలతో పోల్చితే చాలా తక్కువలో మన అంతరిక్ష ప్రాజెక్టులు రూపొందుతున్నాయనడంలో సందేహం లేదు. హాలీవుడ్ సినిమాల బడ్జెట్ కంటే చాలా తక్కువ బడ్జెట్‌తో మన దేశం ఎన్నో ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపింది. చంద్రయాన్-3 విషయంలో కూడా అదే జరిగింది.
రూ. 615 కోట్లతో ముగిసిన ప్రాజెక్టు..
చంద్రయాన్-3 మిషన్ బడ్జెట్ రూ.600 కోట్లుగా నిర్ణయించారు. అయితే చివరికి రూ.615 కోట్లకు చేరింది. చంద్రయాన్-2తో పోలిస్తే ఈ బడ్జెట్ చాలా తక్కువ. ఎందుకంటే.. చంద్రయాన్-2 మిషన్ బడ్జెట్ దాదాపు రూ. 978 కోట్లు. చంద్రయాన్-3 తక్కువ ధరకు ప్రధాన కారణం.. ఆర్బిటర్‌ను ఉపయోగించకపోవడమే. ఆర్బిటర్‌కు బదులుగా.. ప్రొపల్షన్ మాడ్యూల్ ఉపయోగించబడింది. ఆర్బిటర్‌తో పోలిస్తే దీని నిర్మాణానికి తక్కువ ఖర్చు అవసరం అవుతుంది. అందుకే బడ్జెట్ కూడా చంద్రయాన్-2 కంటే తగ్గింది.
ఇతర దేశాలతో పోల్చితే చాలా తక్కువ..!
భారతదేశ అంతరిక్ష యానంతో పోల్చితే మన దగ్గర చాలా తక్కువలో అంతరిక్ష ప్రయోగాలు ముగుస్తాయి. దీంతో చాలా దేశాలు తమ ఉపగ్రహాలను ప్రయోగించేందుకు మన దేశంపై ఆధారపడతాయి. ఇతర దేశాలతో పోలిస్తే.. భారత దేశం తన అంతరిక్ష యాత్రలను అతి తక్కువ ఖర్చుతో విజయవంతంగా నిర్వహిస్తోంది. మన దేశంలో వందల కోట్లలో అయ్యే ప్రాజెక్టు ఖర్చు ఇతర దేశాల్లో లక్షల కోట్లకు చేరుకుంటోంది. చైనా చాంగ్-ఇ 4 మూన్ మిషన్ ఖర్చు రూ.69.38 లక్షల కోట్లు. ఇప్పటివరకు అమెరికా చేసిన అన్ని మూన్ మిషన్ల ఖర్చు రూ. 825 లక్షల కోట్ల రూపాయలు. మరోవైపు.. సోవియట్ యూనియన్ తన చంద్రుని మిషన్లపై చేసిన వ్యయం కూడా దాదాపు రూ.165 లక్షల కోట్లుగా ఉండటం విశేషం. మన చంద్రయాన్-3 కంటే ముందు చంద్రుడిపై కాలు మోపాలన్న ఉద్దేశంతో రష్యా దేశం పంపించిన లూనా-25 స్పెస్‌క్రాఫ్ట్ బడ్జెట్ ఎంతో తెలుసా? రూ.1600 కోట్లు. కానీ.. అది చంద్రుడి ఉపరితలంపై చేరగానే కుప్పకూలింది.
హాలీవుడ్ సినిమాల కంటే తక్కువ బడ్జెట్..!
కొన్ని హాలీవుడ్ సినిమాల కంటే కూడా చాలా తక్కువ బడ్జెట్‌లో మన అంతరిక్ష ప్రయోగాలు అవుతున్నాయంటే నిజంగా అద్భుతమే. అంతరిక్షయానంలో భాగంగా మరో గ్రహాన్ని చూపించే హాలీవుడ్ సినిమా అవెంజర్స్ బడ్జెట్ రూ.2,443 కోట్లు. కాగా అవతార్ సినిమా బడ్జెట్ 3,282 కోట్లు. దీంతో పోలిస్తే.. భారతదేశ అంతరిక్ష ప్రయోగాల బడ్జెట్ చాలా తక్కువే. ఈ ఏడాదిలో విడుదలై డిజాస్టర్‌గా నిలిచిన ఆదిపురుష్ బడ్జెట్ ఈ చంద్రయాన్-3 కంటే ఎక్కువ. ఆ సినిమాని రూ.700 కోట్లతో నిర్మించారు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా చాలా తక్కువలో ఇస్రో మన అంతరిక్ష ప్రయోగాలు పూర్తి చేస్తోంది.