గణపతి బప్పా మోరియా… చేతిలో లడ్డూ చోరియా..
కొన్ని రోజులుగా వినాయక మండపాల్లో లడ్డూలు చోరీకి గురవుతున్నాయి.హైదరాబాద్‌లోని మియాపూర్‌లో ఓ మండపంలో లడ్డూ చోరికి గురైంది. ఓ దొంగ అర్ధరాత్రి దాటిన తర్వాత మండపంలో ప్రవేశించి లడ్డూను ఎత్తుకెళ్లిపోయాడు. అందుకు సంబంధించిన దృశ్యాలు అక్కడే ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. మూడు రోజుల కిందట ఆసిఫాబాద్ కొమురం భీమ్ జిల్లా కాగజ్ నగర్ మండలం గొర్రెగూడలో వినాయక విగ్రహం వద్ద లడ్డూ శుక్రవారం మాయమైంది.
తాజాగా, హైదరాబాద్ పాతబస్తీలోని ఓ గణేష్ మండపంలో లడ్డూ చోరికి గురయ్యింది. వినాయకుడి చేతిలోని 21 కిలోల లడ్డూను పాఠశాల విద్యార్థులు ఎత్తుకెళ్లారు. చార్మినార్ పీఎస్ పరిధిలోని ఝాన్సీ బజార్ ప్రాంతంలో శ్యామ్ అగర్వాల్ అనే వ్యక్తి వినాయక మండపం ఏర్పాటు చేశాడు. గణపతి చేతిలో దాదాపు 21 కేజీల లడ్డూను ఉంచారు. శనివారం సాయంత్రం కొందరు పాఠశాల విద్యార్థులు గణపతి చేతిలోని లడ్డూను ఎత్తుకెళ్లిపోయారు. అనంతరం లడ్డూను సమానంగా పంచుకొని తినేశారు. ఈ దృశ్యాలు సమీపంలోని సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఘటనపై మండపం నిర్వహకుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు.