జడ్జిపై అభ్యంతరకర పోస్టులు… రాష్ట్రపతి భవన్ సీరియస్
జస్టిస్ సత్య వెంకట హిమ బిందు.. ఇప్పుడు ఈ జడ్జి పేరు మారుమోగిపోతోంది. చంద్రబాబు కేసులో తీర్పు ఇచ్చిన ఏసీబీ న్యాయమూర్తి ఈమె. ప్రస్తుతం రెండు తెలుగురాష్ట్రాల్లో మారుమోగుతున్న పేరు కూడా జస్టిస్ హిమబిందుదే. తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలో అదనపు జిల్లా, సెషన్స్ జడ్జిగా పనిచేశారు. అంతకు ముందు ఏసీబీ కోర్టులో న్యాయమూర్తిగా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అరెస్టుపై జస్టిస్ హిమ బిందు ఇచ్చిన రిమాండ్ తీర్పు అందరి దృష్టినీ ఆకర్షించింది. గతంలో కూడా అనేక సంచలన తీర్పులు ఇచ్చారు.
చంద్రబాబును స్కిల్ స్కామ్ పై అభియోగాలు ఎదుర్కొంటున్న వ్యక్తిగా చంద్రబాబును పేర్కొనడం, ఆయనను రిమాండ్‌కు పంపుతూ జడ్జి తీర్పు నివ్వడం జీర్ణించుకోలేని టీడీపీ శ్రేణులు ఆమెకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నాయి. చంద్రబాబు రిమాండ్ కు వెళ్లినతర్వాత 16 రోజులుగా జడ్జి హిమబిందుపై సోషల్ మీడియాలో రకరకాల పోస్టులు పెడుతున్నారు తెలుగు దేశం నేతలు. ఆమె హోదాను, గౌరవాన్ని కించపరుస్తూ ఇష్టానుసారం కామెంట్లు చేస్తున్నారు. ఇదే అంశంపై సీనియర్ జర్నలిస్టు, సామాజిక కార్యకర్త, హై కోర్టు న్యాయవాది ఇందుగుబల్లి రామానుజం భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఫిర్యాదు చేశారు.
బాధ్యతాయుతమైన జడ్జి హిమబిందు చట్టపరమైన విధులను నిర్వర్తిస్తే వాటిని విమర్శిస్తూ వ్యక్తిత్వాన్ని కించపరచడం ఎంత వరకూ సబబన్నారు. వీటిపై పోలీసులు చర్యలు తీసుకోవాలనికోరారు. స్పందించిన రాష్ట్రపతి భవన్ వారిపై చర్యలు కఠిన తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ఏపీ సీఎస్‌కు రాష్ట్రపతి కార్యదర్శి పీసీ మీనా నుంచి ఆదేశాలు అందాయి. ఇలా పోస్టులు పెడుతున్న వారిపై తీసుకున్న చర్యలను జడ్జికి వివరించాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. దీంతో జడ్జిపై పోస్టులు చేసిన వారిపై కేసులు నమోదు చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు.
జడ్జి హిమబిందుపై సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులను పశ్చిమ గోదావరి జిల్లా గౌడ సమస్య సంఘం నాయకులు ఇటీవల ఖండించారు. న్యాయపరంగా తీర్పు ఇచ్చిన జడ్జిపై సోషల్ మీడియాలో అసభ్యకరంగా వస్తున్న పోస్ట్‌ల ను గుర్తించి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. అవసరమైతే గౌడ, శెట్టిబలిజ, శ్రీశైన, ఈడిగ, యాత కులాలకు సంబంధించిన ప్రతి ఒక్కరు పార్టీలకు అతీతంగా రోడ్లమీదకు వచ్చి ధర్నాలు చేస్తామని వార్నింగ్ ఇచ్చారు.