పురుగుల మందు తాగి విద్యార్థి మృతి

తోటి విద్యార్థులు దాడి చేయడంతో డిగ్రీ విద్యార్థి మృతి చెందిన ఘటన విషాదం నింపింది. వివరాల్లోకి వెళితే.. మంచిర్యాల జిల్లా నెన్నల మండలానికి చెందిన కామెర ప్రభాస్(19) మందమర్రి మండలం పొన్నారం గ్రామం ఎస్సీ హాస్టల్ లో ఉంటూ సివి రామన్ కాలేజీలో బీకాం కంప్యూటర్స్ డిగ్రీ మొదట సంవత్సరం చదువుతున్నాడు. ఎస్సీ హాస్టల్ లో మూడు రోజుల కిందట తోటి విద్యార్థులు వేధిస్తూ, దాడి చేశారు. డబ్బులకు సంబంధించిన విషయంలో ఈ దాడి చేసినట్లు సమాచారం.
ప్రభాస్ కానిస్టేబుల్ పరీక్షలకు ప్రిపేర్ అవుతానని, షూ కొనుకుంటానని అతని అక్క, తల్లి దగ్గర డబ్బులు తీసుకున్నాడు. అతను కాలేజీ వెళ్లి వచ్చే సరికి ఆ డబ్బుల మాయం కావడం దాని వ్యవహారంలో కొంత మంది తో గొడవ జరిగినట్లు తెలుస్తోంది. తన డబ్బులు పోవడంతో పాటు, తనపై దాడి చేయడంతో మనస్తాపానికి గురైన ప్రభాస్ పురుగుల మందు తాగాడు. అలాగే ఇంటికి సైతం వెళ్లాడు. అతన్ని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృత్యువాత పడ్డాడు. మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి మృతదేహం తరలించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.