మావోయిస్టుల వరుస లేఖలు
కలవరంలో నేతలు...

మావోయిస్టుల వరుస లేఖలతో కలకలం రేగుతోంది.. సిర్పూర్, చెన్నూర్ కమిటీ పేరుతో ఎమ్మెల్యే కోనేరు కోనప్పకు హెచ్చరికలు జారీచేసిన మావోయిస్టు పార్టీ, సికాస పేరుతో మరో లేఖ విడుదల చేసింది.
సిర్పూర్ కాగజ్ నగర్ లో మావోయిస్టుల లేఖ కలకలం రేపింది. సిర్పూర్ చెన్నూరు ఏరియా కమిటీ కార్యదర్శి మంగు పేరుతో లేఖ విడుదల చేసారు. కోనప్ప వలస దోపిడిదారనీ దుయ్యబట్టారు. సహజ వనరులను కొల్లగొట్టి కోట్లకు పడగెత్తాడనీ ఆరోపించారు. ఉచిత అంబలి అన్నం పేరుతో పేద ప్రజలను మోసం చేస్తున్నాడనీ లేఖలో పేర్కొన్నారు. నకిలీ బంగారం, డబ్బు, మద్యం పంపిణీ చేసి మళ్లీ గెలవాలని చూస్తున్నాడనీ, అతన్ని ఓడించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. దళిత ఆదివాసులపై దాడులకు తెగబడుతున్నాడనీ, పేదప్రజలకు సంబంధించి 670 ఎకరాల భూమిని ఆక్రమించాడనీ స్పష్టం చేశారు. కోనేరు ట్రస్ట్ పేరుతో రియల్ ఎస్టేట్ దందా చేస్తున్నాడని, ప్రజలపై దోపిడీకి పాల్పడుతున్న ఎమ్మెల్యే కోనేరు కోనప్పకు శిక్ష తప్పదని హెచ్చరించారు.
ఇక సికాస పేరుతో మరో లేఖ విడుదలయ్యింది. తెలంగాణలో బూటకపు అసెంబ్లీ ఎన్నికలను బహిష్కరించాలని కార్మికులకు పిలుపునిచ్చారు. BJPని బహిష్కరించాలని పేర్కోన్నారు. అవకాశవాద BRSను సైతం తన్ని తరమాలన్నారు. మిగతా రాజకీయ పార్టీలను నిలదీయాలన్నరు. మీ సమస్యలను పరిష్కరించే వరకు ఎన్నికలను బహిష్కరించాలని కార్మికులను కోరారు. ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటీకరణాన్ని వ్యతిరేకించాలని, ఓపెన్ కాస్టులను రద్దు చేయాలని డిమాండ్ చేయాలన్నారు. ఉత్పత్తి రంగాల్లో, కాంట్రాక్టు కార్మికులను, ఔట్ సోర్సింగ్ కార్మికులను, కేజువల్ కార్మికులను పర్మినెంట్ చేయాలన్నారు. సింగరేణి కోల్ బెల్ట్ కమిటి కార్యదర్శి ప్రభాత్ పేరిట ఈ లేఖ విడుదల అయ్యింది. అయితే, ఈ లేఖలు నిజమైనవా..? కాదా..? అనే విషయంలో పోలీసులు ఆరా తీస్తున్నారు.