ముగిసిన కాంగ్రెస్ శాసనసభ పక్ష సమావేశం..
కాంగ్రెస్ శాసనసభ పక్ష సమావేశం ముగిసింది. గచ్చిబౌలి ఎల్లా హోటల్లో 64 ఎమ్మెల్యేలతో డీకే శివకుమార్, మాణిక్రావ్ ఠాక్రే సమావేశమయ్యారు. సీఎం అభ్యర్థిపై వారి అభిప్రాయాలు తీసుకున్నారు. ఏఐసీసీ పరిశీలకుల సమక్షంలో సీఎల్పీ సమావేశం సుమారు అరగంటసేపు జరగ్గా.. కాంగ్రెస్ శాసనసభా పక్ష నేతను పార్టీ నాయకత్వం ఎంపిక చేసింది. సీఎల్పీ నేత ఎంపిక బాధ్యతను అధిష్ఠానానికి అప్పగిస్తూ.. ఏకవాక్య తీర్మాణం చేశారు. ఈ ఏక వాక్య తీర్మానాన్ని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టగా తుమ్మల నాగేశ్వర్‌రావు ఆ తీర్మానాన్ని బలపర్చారు. ఈ తీర్మానం ఢిల్లీ అధిష్ఠానానికి పంపించారు. సీఎల్పీ నేత ఎంపికపై అధిష్ఠానం వీలైనంత త్వరగానే.. తన నిర్ణయాన్ని సీల్డ్ కవర్‌లో గాంధీభవన్‌కు పంపించనుంది. అధిష్థానం పంపిన సీఎం అభ్యర్థి పేరును పార్టీ అధికారికంగా ప్రకటించనున్నారు.
ఈ సమావేశంలో డీకే శివకుమార్, ఏఐసీసీ పరిశీలకులు నేతలతో చర్చలు జరుపుతున్నారు. అంతకుముందు పార్క్ హయత్ హోటల్‌లో డీకేతో ఉత్తమ్ కుమార్, భట్టి విక్రమార్క, రాజగోపాల్ రెడ్డి సమావేశం అయ్యారు. దాదాపు గంటపాటు చర్చించుకున్నారు. సీఎం ఎంపిక చుట్టూనే ఇదంతా జరిగినట్టు తెలుస్తోంది. అయితే భేటీ అనంతరం వీరంతా ఎల్లా హోటల్‌కు పయనం అయ్యారు. పార్టీ అధిష్ఠానం నిర్ణయం ఏంటి? ఎమ్మెల్యేలు ఏమనుకుంటున్నారు? ఆ ముగ్గురు కీలక నేతలతో డీకే ఎందుకు భేటీ అయినట్టు? అసలు సీఎం ఎవరు కానున్నారు? ఇప్పుడు ఇదే చర్చనీయాంశమైంది.