సీపీఐ వల్లే కాంగ్రెస్ గెలిచింది
-నారాయణ సంచలన వ్యాఖ్యలు
-లోక్‌సభకు పోటీ చేస్తామని వెల్లడి
CPI Narayana: సీపీఐతో పొత్తు వల్లనే కాంగ్రెస్ పార్టీ గెలిచిందని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. తెలంగాణలో సీపీఐ ఓట్లు కలవడం వల్లే కాంగ్రెస్ విజయం సాధించిందని, సీపీఐ పొత్తు వల్లనే ఇక్కడ అధికారంలోకి వచ్చిందని వెల్లడించారు. కమ్యూనిస్టులతో పొత్తులేకపోవడం వల్లే మిగతా మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఓడిపోయిందని చురకలు అంటించారు. కాంగ్రెస్ జాతీయ నాయకత్వం దీన్ని గుణపాఠంగా తీసుకోవాలన్నారు. రాజస్తాన్, ఛత్తీస్ఘడ్, మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ ఒంటెద్దు పోకడల వల్లే ఓడి పోయిందని వ్యాఖ్యానించారు. తెలంగాణలో అందరినీ కలుపుకుపోయింది కాబట్టి కాంగ్రెస్ విజయం సాధించిందన్నారు. వచ్చే ఎన్నికలలో కేరళలో 4, తమిళనాడు 2, బెంగాల్ 3, తెలంగాణ, ఏపీల్లో ఒక్కో ఎంపీ స్థానానికి పోటీ చేస్తామని చెప్పారు నారాయణ.