కార్మికులను మోసం చేస్తున్న పేపర్‌మిల్లు యాజమాన్యం

కాగజ్‌నగర్ ఎస్పీఎం యాజమాన్యం కార్మికులను మోసం చేస్తోందని, మిల్లులో జరిగిన అవినీతి అక్రమాలపై విచారణ చేసి కార్మికులకు న్యాయం చేయాలని ఎస్పీఎం పర్మినెంట్ అండ్ క్యాజువల్ లేబర్ యూనియన్ అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్, ప్రధాన కార్యదర్శి ఈర్ల సతీష్ కుమార్ డిమాండ్ చేశారు. శనివారం కార్మిక శాఖ కమిషనర్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. ఎస్పీఎం పేపర్ మిల్లులో కార్మిక గుర్తింపు సంఘం ఎన్నికలతో పాటు సొసైటీడబ్బుల విచారణ తదితర అంశాలపై కమిషనర్ దృష్టికి తీసుకువచ్చారు.
సిర్పూర్ పేపర్ మిల్లు యాజమాన్యం రీ ఒపెనింగ్ సందర్భంగా మంత్రి KTR సమక్షంలో కార్మికులతో ఏర్పాటు చేసిన సమావేశంలోకార్మికులకు న్యాయం చేస్తామని, మిల్లులో పనిచేసిన ప్రతి కార్మికునికి విధులో తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఇప్పటికి ఆరు సంవత్సరాలు గడుస్తున్నా యాజమాన్యం ఇచ్చిన హామీలు అమలు చేయలేదు. కార్మికుల హక్కుల సాధన కోసం కార్మిక సంఘం ఎన్నికలు కూడా జరుగనివ్వకుండా అడ్డుపడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ కోర్టు నుండి వచ్చిన నిధుల దుర్వినియోగం పై విచారణ చేయాలని కోరారు. పర్మినెంట్ కార్మికులకు కొంత మొత్తంలో చెల్లించి సంబంధం లేని స్టాఫ్ ఉద్యోగులకు చెల్లించడం పై విచారణ జరపాలన్నారు. అసలు నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ కోర్టు నుండి వచ్చిన డబ్బులు ఎంత..? అనే విషయాన్ని సిర్పూర్ పేపర్ మిల్లు సొసైటీ డబ్బుల వివరాలు యాజమాన్యం చెప్పకపోగా, అప్పు ఉన్న కార్మికుల నుండి డబ్బులు వసులుచేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. సొసైటీ డబ్బుల జమ, అప్పులపై ప్రభుత్వ అధికారి సమక్షం లో విచారణ జరిపి కార్మికులకు న్యాయం చేయాలి.
వేతన ఒప్పందం పై కార్మికుల ఫోర్టరీ సంతకాలు పెట్టి తప్పుడు వేతన ఒప్పందం జరిగినట్టు తెలుస్తోందని, దీనిపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. పేపర్ మిల్లు లాభాల బాటలో ఉన్నా కొంతభాగం కార్మికులకు చెల్లించాల్సి ఉన్నా యాజమాన్యం నష్టాల పేరిట బోనస్ లో న్యాయం చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మిక కమిటీ వెంటనే రద్దు చేయాలని, 2018 నుండి 2023 వరకు బోనస్ చెల్లింపుపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. పేపర్ మిల్లు లో కార్మికులకు కనీసం క్యాంటిన్ సౌకర్యం లేకపోవడం తో తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నాని తెలిపారు. తొందరలోనే కార్మిక సంఘ ఎన్నికలు నిర్వహించాలన్నారు.
దీనిపై స్పందించిన కార్మిక శాఖ కమిషనర్ త్వరలోనే కంపెనీకి నోటీసులు పంపిస్తామని మాటిచ్చారని, త్వరలోనే ఎన్నికలు జరుగుతాయని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు ఎస్పీఎం పర్మినెంట్ అండ్ క్యాజువల్ లేబర్ యూనియన్ ప్రధాన కార్యదర్శి ఈర్ల సతీష్, రహీమ్, శ్రీనివాస్, బీఆర్ఎస్ నాయకులు లెండుగురే శ్యామ్ రావ్,అంబల ఓదెలు, నక్క మనోహర్ తదితరులు పాల్గొన్నారు.