త్వరలోనే 35 వేల ఉద్యోగాల భర్తీ

ముఖ్య‌మంత్రి రేవంత్​ రెడ్డి ప్ర‌క‌ట‌న‌

CM Revanth Reddy:త‌మ ప్ర‌భుత్వం ఏర్పాటైన 90 రోజుల్లోనే 30 వేల ఉద్యోగ నియామ‌క ప‌త్రాలు అందించామ‌ని, నిరుద్యోగ స‌మస్య‌ శాశ్వ‌తంగా ప‌రిష్క‌రించేందుకు ప్ర‌య‌త్నిస్తున్నామ‌ని ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి స్ప‌ష్టం చేశారు. త్వరలోనే మరో 35 వేల ఉద్యోగాలు భర్తీ చేయబోతున్నామన్నారు. రాజీవ్ గాంధీ సివిల్స్ అభ‌య‌హ‌స్తం చెక్కుల‌ను అందించారు. ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ రాష్ట్రం నుంచి అత్యధికంగా సివిల్‌ సర్వెంట్లు రావాలని ఆశిస్తున్నామ‌న్నారు. సివిల్స్‌ ఉత్తీర్ణులై రాష్ట్ర ప్రతిష్ట పెంచాలని కోరారు. నైపుణ్యాలు లేకపోవడం వల్ల నిరుద్యోగం పట్టిపీడిస్తోంద‌ని, చదువుకు తగిన నైపుణ్యాలు లేకపోవడంతో ఉపాధిఅవకాశాలు కోల్పోతున్నారని అన్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి యంగ్ ఇండియా వర్సిటీలో ఏటా 20 వేల మందికి శిక్షణ ఇస్తామ‌ని ముఖ్య‌మంత్రి స్ప‌ష్టం చేశారు. వచ్చే విద్యా సంవత్సరంలో యంగ్‌ ఇండియా స్పోర్ట్స్‌ వర్సిటీ ఏర్పాటు చేస్తామ‌ని, 2028 ఒలింపిక్స్‌లో తెలంగాణ అథ్లెట్లకు అత్యధికంగా పతకాలు వచ్చేలా కృషి చేస్తున్నామ‌న్నారు.

10, 15 రోజుల్లో అన్ని వర్సిటీలకు నూతన వైస్‌ ఛాన్సలర్లను నియమిస్తామ‌ని సీఎం వెల్ల‌డించారు. వర్సిటీల్లోని అన్ని ఖాళీ పోస్టులను భర్తీ చేస్తామ‌న్నారు. కొందరు ఉద్దేశపూర్వకంగా నిరుద్యోగులను రెచ్చగొడుతున్నారని, నిరుద్యోగులను రెచ్చగొట్టి రాజకీయ లబ్ధిపొందాలని చూస్తున్నార‌ని తెలిపారు. ఒక‌వేళ ఉద్యోగ అర్హత పరీక్షలను వాయిదా వేస్తే నిరుద్యోగులకే నష్టమ‌న్నారు. సహేతుకమైన కారణాలు చెబితే నిరుద్యోగులు చెప్పింది వినడానికి మేం సిద్ధం రేవంత్‌రెడ్డి ఈ సంద‌ర్భంగా వ్యాఖ్యానించారు.

యూపీఎస్సీ ప్రిలిమిన‌రీ ప‌రీక్ష‌ల్లో ఉత్తీర్ణులై, మెయిన్స్ కోసం ప్రిపేర్ అవుతున్న తెలంగాణ అభ్య‌ర్థుల‌కు రాజీవ్ గాంధీ సివిల్స్ అభ‌య‌హ‌స్తం ద్వారా ఒక్కొక్క‌రికి ల‌క్ష రూపాయ‌లు అందిస్తామ‌ని ముఖ్య‌మంత్రి ప్ర‌క‌టించారు. ఈ మేర‌కు సోమ‌వారం ఒక్కో అభ్య‌ర్థికి ల‌క్ష చొప్పున 135 మంది ఈ చెక్కుల‌ను అందించారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like