కవితకు బెయిల్
MLC Kavitha Bail: మద్యం కుంభకోణం కేసులో నిందితురాలిగా ఉన్న ఎమ్మెల్సీ కవితకు సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఆమె దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ పై జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ విశ్వనాథన్ తో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. కవిత తరపున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గ, ఈడీ తరఫున ఏఎస్ జీ వాదనలు వినిపించారు. ఇరువైపులా వాదనలు విన్న ధర్మాసనం కవితకు బెయిల్ మంజూరు చేసింది. కవితను ఈడీ ఈ ఏడాది మార్చి 15న అరెస్ట్ చేసింది. మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద అరెస్ట్ చేసినట్లు ఈడీ అసిస్టెంట్ డైరెక్టర్ జోగేందర్ ప్రకటించారు. ఇంట్లో సోదాలు నిర్వహించి, మనీ లాండరింగ్ నిరోధక చట్టం ప్రకారం ఆమెను విచారించి వాంగ్మూలం నమోదు చేశారు. ఆమె నుంచి ఐదు సె ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.
దాదాపు ఐదు నెలలుగా ఎమ్మెల్సీ కవిత లిక్కర్ పాలసీ కేసులో జైల్లో ఉంటున్నారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ వ్యవహారంలో కవిత జైల్లో ఉండాల్సిన అవసరం లేదని సుప్రీం కోర్టు అభిప్రాయ పడింది. కవిత బెయిల్ పిటిషన్‌గతంలో పలుమార్లు తిరస్కరణకు గురైంది.
ఢిల్లీ లిక్కర్ పాలసీ వ్యవహారంలో ఛార్జిషీట్లు దాఖలైనందున కవిత బెయిల్ పొందడానికి అర్హురాలని కవిత తరపు న్యాయవాదులు వాదించారు. మరోవైపు కవిత సాక్ష్యాధారాలను ధ్వంసం చేశారని, దాదాపు 16 మొబైల్ ఫోన్లను కవిత ధ్వంసం చేశారని సిబిఐ, ఈడీ తరపు న్యాయవాదులు అభ్యంతరం తెలిపారు.
గత మార్చిలో ఢిల్లీ లిక్కర్ పాలసీలో సిబిఐ ఎమ్మెల్సీ కవితను అరెస్ట్ చేసింది. అనంతరం ఇదే కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ నమోదు చేసిన కేసులో కవితను అరెస్ట్ చేసినట్టు ప్రకటించారు. ఈడీ, సిబిఐ నమోదు చేసిన కేసుల్లో గత ఐదు నెలలుగా కవిత జైల్లో ఉన్నారు. కవిత బెయిల్ పిటిషన్ సందర్భంగా చార్జిషీట్లు నమోదు చేసినందున బెయిల్ మంజూరు చేసింది.
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో బెయిల్ మంజూరు చేయడానికి ఢిల్లీ హైకోర్టు తిరస్కరించడంతో కవిత సుప్రీం కోర్టును ఆశ్రయించారు. కవిత బెయిల్ పిటిషన్‌పై వైఖరి తెలపాలంటూ సుప్రీం కోర్టు గతంలో ఆదేశించింది.ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కుంభకోణంలో టీఆర్ ఎస్ నాయకురాలు కల్వకుంట్ల కవిత ప్రమేయం ఉందని నిరూపించడానికి ఎలాంటి ఆధారాలు ఉన్నాయో తెలపాలని ఈడీ, సీబీఐలను సుప్రీంకోర్టు ఆదేశించింది.
సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ), ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దర్యాప్తు చేస్తున్న ఈ కుంభకోణానికి సంబంధించిన అవినీతి, మనీలాండరింగ్ కేసుల్లో బెయిల్ కోరుతూ కవిత దాఖలు చేసిన పిటిషన్లను జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కేవీ విశ్వనాథన్లతో కూడిన ధర్మాసనం మంగళవారం విచారించింది.