రెండో విడత ప్రజాపాలన

Prajapalana Program : తెలంగాణ ప్రభుత్వం మరోసారి ప్రజాపాలన కార్యక్రమం నిర్వహణకు సిద్ధమైంది. సెప్టెంబర్ 17 నుంచి 10 రోజుల పాటు ప్రజాపాలన కార్యక్రమం చేపట్టనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈ కార్యక్రమంలో రేషన్ కార్డులు, హెల్త్ కార్డుల కోసం అధికారులు దరఖాస్తులు స్వీకరించనున్నారు. పూర్తి హెల్త్ ప్రొఫైల్ తో ప్రజలందరికీ హెల్త్ కార్డులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు క్షేత్రస్థాయిలో అధికారులను సన్నద్ధం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.
ఆరోగ్య తెలంగాణ దిశగా ప్రజా ప్రభుత్వం అడుగులు వేస్తుందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రజల ఆరోగ్య భద్రతే లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు. వైద్య రంగం అభివృద్ధికి బడ్జెట్లో రూ.11,500 కోట్లు కేటాయించామన్నారు. ఆరోగ్య శ్రీ పరిమితిని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచినట్లు పేర్కొన్నారు. ప్రభుత్వ చర్యలతో సర్కారు దవాఖానాల్లో వైద్య సేవల నాణ్యత ప్రమాణాలు పెరిగాయన్నారు.
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో ఆరు గ్యారంటీల అర్హుల ఎంపిక కోసం ప్రజాపాలన దరఖాస్తులు స్వీకరించారు. అప్పట్లో సుమారు 1.25 కోట్ల ప్రజాపాలన దరఖాస్తులు వచ్చాయిని ప్రభుత్వం తెలిపింది. రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇల్లు, రూ.500 గ్యాస్ సిలిండర్ల కోసం ఎక్కువ దరఖాస్తులు వచ్చాయని ప్రభుత్వం పేర్కొంది. మరోసారి ప్రజాపాలన దరఖాస్తులు ఆహ్వానించి రేషన్ కార్డులు, హెల్త్ కార్డులు కోసం వివరాలు సేకరించనున్నారు.