పోలీస్ జట్టు విజేత
జాతీయ క్రీడా దినోత్సవం పురస్కరించుకొని క్రికెట్ మ్యాచ్ నిర్వహణ
Komuram Bhim Asifabad District: ప్రతి ఒక్కరూ క్రీడలను జీవితంలో భాగం చేసుకోవాలని కలెక్టర్ వెంకటేష్ ధోత్రె తెలిపారు. గురువారం ఆసిఫాబాద్ జిల్లాలో జాతీయ క్రీడా దినోత్సవం నిర్వహించారు. ముందుగా మేజర్ ధ్యాన్ చంద్ ఫోటోకి కలెక్టర్ పూలమాల వేసి క్రీడలను ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జాతీయ క్రీడా దినోత్సవం కారణంగా స్నేహపూర్వక వాతావరణంలో క్రీడలు నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. ఎస్పీ శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ శారీరక శ్రమతో పాటు మానసిక ఉల్లాసం కోసం క్రీడలను ఎంచుకోవాలన్నారు. ఆటల్లో గెలుపు ఓటములు సహజం అని, నిజ జీవితంలో కూడా వీటిని ప్రతి ఒక్కరు అలవర్చుకోవాలన్నారు.
ఈ సందర్భంగా నిర్వహించిన మ్యాచ్‌లో పోలీస్ జట్టు విజేతగా నిలిచింది. ఈ క్రీడల్లో మొత్తం నాలుగు జట్లు పాల్గొన్నాయి. కలెక్టర్ ఆధ్వర్యంలో రెవెన్యూ ఎలెవన్ జట్టు, ఎస్పీ ఆధ్వర్యంలో పోలీస్ ఎలెవన్ జట్టు, జిల్లా డీఎఫ్ఓ ఆధ్వర్యంలో టీచర్స్ ఎలెవన్ జట్టు, మీడియా పాత్రికేయలది ఒక జట్టుగా ఏర్పాటు చేశారు. మొదటగా పోలీస్ జట్టు, మీడియా జట్టు మధ్య మ్యాచ్ నిర్వహించారు. దానిలో పోలీస్ జట్టు విజేతగా నిలిచింది. అనంతరం రెవెన్యూ జట్టు, టీచర్స్ జట్టు మధ్య జరిగిన మ్యాచ్‌లో టీచర్స్ జట్టు గెలుపొందింది. అనంతరం పోలీస్ జట్టు, టీచర్స్ జట్ల మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్ లో పోలీస్ జట్టు
విజేతగా నిలిచింది. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ దీపక్ తివారి, జిల్లా అటవీ శాఖ అధికారి నీరజ్ కుమార్ బత్రేవాల్ తదితరులు పాల్గొన్నారు.