పారాలింపిక్స్ లో సరికొత్త చరిత్ర
Paralympics 2024:పారిస్ వేదికగా జరుగుతున్న పారాలింపిక్స్ 2024 (Paralympics 2024)లో భారత్ పతకాల వేటను ఆరంభించింది. దివ్యాంగుల విశ్వక్రీడల్లో భారత షూటర్ అవనీ లేఖరా (Avani Lekhara) స్వర్ణ పతకంతో మెరిసింది. మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ (SH1) విభాగంలో అవనీ అగ్రస్థానంలో నిలిచి బంగారుపతకాన్ని సాధించింది. 249.7 పాయింట్లతో సమీప ప్రత్యర్థి లీపై విజయాన్ని అందుకుంది. ఫలితంగా గోల్డ్ మెడల్ సాధించింది. 246.8పాయింట్లతో లీ రెండో స్థానంలో నిలిచి సిల్వర్ పతకాన్ని సాధించింది. మూడో స్థానంలో మోనా అగర్వాల్ (భారత్) నిలిచి కాంస్య పతకాన్ని అందుకుంది. ఫలితంగా 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ లో భారత్ కు రెండు పతకాలు సొంతం అయ్యాయి.
పారిస్ పారాలింపిక్స్‌లో పతకం సాధించడం ద్వారా అవనీ లేఖరా సరికొత్త చరిత్రను లిఖించింది. టోక్యో వేదికగా జరిగిన 2020 పారాలింపిక్స్ లో కూడా అవనీ బంగారు పతకంతో మెరిసింది. ఇప్పుడు మరోసారి స్వర్ణ పతకాన్ని సాధించింది. ఫలితంగా పారాలింపిక్స్ లో రెండు స్వర్ణ పతకాలు సాధించిన తొలి భారతీయురాలిగా అవనీ కొత్త చరిత్రను లిఖించింది.
ప్రమాదం నుంచి పతకం వరకూ..
అవనీ లేఖరాకు ఫిబ్రవరి 20, 2012 ఎప్పటికీ గుర్తుంచుకునే తేదీ అని చెప్పవచ్చు. ఎందుకంటే ఆమె కుటుంబం జైపూర్ నుంచి రాజస్థాన్‌లోని ధోల్‌పూర్‌కు వెళుతుండగా కారు ప్రమాదానికి గురైంది. ఆ క్రమంలో ఆమె వెన్నెముక దెబ్బతింది. దీంతో ఆమె నడుము భాగం పక్షవాతానికి గురైంది. అప్పటి 10 ఏళ్ల బాలిక ప్రమాదం జరిగిన తర్వాత రెండేళ్లపాటు ఇంట్లోనే ఉంది. ఆ సమయంలో ఆమె ఎవరితోనూ మాట్లాడేందుకు ఇష్టపడలేదు. ప్రమాదం తర్వాత అవనీ మొదట ఎలా కూర్చోవాలో నేర్చుకుంది. ఆ తర్వాత వీల్ చైర్‌పై పాఠశాలకు వెళ్లడం ప్రారంభించి విద్యను అభ్యసించింది. ఆ నేపథ్యంలో ఆమె తండ్రి ప్రవీణ్ ఆమెను షూటింగ్‌కి పరిచయం చేశాడు. లేఖరా ఆ క్రీడపై ఎంతో ఆసక్తి పెంచుకుని అనేక సవాళ్లను ఎదుర్కొని ఈ స్థాయికి వచ్చింది.