సింగరేణిలో బదిలీ వర్కర్లకు తీపి కబురు
- 2364 మందిని జనరల్ మజ్దూర్లుగా క్రమబద్ధీకరణకు ఆమోదం
- వీరిలో 243 మంది మహిళలు
- త్వరలోనే ఉత్తర్వుల జారీ
- సీఎండీ శ్రీ ఎన్.బలరామ్ వెల్లడి
Singareni: సింగరేణిలో పనిచేస్తున్న 2,364 మంది బదిలీ వర్కర్లను జనరల్ మజ్దూర్లుగా క్రమబద్ధీకరిస్తున్నట్లు సంస్థ సీఎండీ ఎన్.బలరామ్ తెలిపారు. సంస్థలో చేరినప్పటి నుంచి క్యాలెండర్ ఏడాదిలో భూగర్భ గనుల్లో 190 రోజులు, ఉపరితల గనులు, విభాగాల్లో 240 రోజులు విధులు నిర్వహించిన వారిని రెగ్యులరైజ్ చేస్తున్నట్లు వెల్లడించారు. త్వరలోనే ఉత్తర్వులు జారీ చేయాల్సిందిగా డైరెక్టర్(పర్సనల్)కు ఆదేశాలు జారీ చేశారు. సెప్టెంబరు 1, 2024 తేదీ నుంచి వీరిని జనరల్ మజ్దూర్లుగా గుర్తిస్తామని స్పష్టం చేశారు. ఎలాంటి నిరీక్షణ లేకుండా ఏడాదిలో నిర్ణీత మస్టర్లు పూర్తి చేసిన వారిని జనరల్ మజ్దూర్లుగా గుర్తిస్తుండటం పట్ల కార్మికులు హర్షం వ్యక్తం చేశారు. సింగరేణిలో కారుణ్య, డిపెండెంట్ ఉద్యోగ నియామక ప్రక్రియలో భాగంగా సంస్థ లో చేరిన వారిని తొలుత బదిలీ వర్కర్లుగా సంస్థ నియమిస్తోంది. ఏడాది కాలం పనిచేసిన తర్వాత కనీస మస్టర్లు పూర్తి చేస్తే జనరల్ మజ్దూర్లుగా శాశ్వత ఉద్యోగులుగా గుర్తిస్తోంది. ఉన్నతవిద్యార్హతలు కలిగిన వీరంతా కంపెనీలో ఇంటర్నల్ ఉద్యోగాల ద్వారా పదోన్నతులు పొందడానికి అర్హత లభిస్తుంది. క్వార్టర్ల కేటాయింపులో ప్రాధాన్యత ఉంటుంది.
క్రమశిక్షణతో పనిచేయాలి.. : సీఎండీ ఎన్.బలరామ్
సింగరేణిలో ఒకేసారి 2364 మందిని జనరల్ మజ్దూర్లుగా ఉద్యోగ ఉన్నతి కల్పిస్తున్నామని, సంస్థ అభివృద్ధికి ప్రతీ ఒక్కరూ అంకిత భావం, క్రమశిక్షణతో పనిచేయాలని సీఎండీ ఎన్.బలరామ్ సూచించారు. ఉద్యోగాల కోసం ఎందరో ఉన్నత విద్యావంతులు నిరీక్షిస్తున్నారని, కానీ సింగరేణిలో సేవ చేసే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. జనరల్ మజ్దూర్లుగా క్రమ బద్ధీకరించినందున ఇంకా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, డ్యూటీలకు గైర్హాజరు కావొద్దని, సమయ పాలన పాటిస్తూ విధులు నిర్వర్తించాలని పేర్కొన్నారు. ఈ ఏడాదిలో కంపెనీ ఆధ్వర్యంలో వెయ్యికి పైగా ఇంటర్నల్ ఉద్యోగాలను భర్తీ చేయబోతున్నామని.. అర్హులైన వారు ఉన్నత స్థాయికి చేరుకోవడానికి అన్ని అవకాశాలు కల్పిస్తున్నామన్నారు. కంపెనీ వ్యాప్తంగా కార్పోరేట్ ఏరియాలో 25 మంది, కొత్తగూడెంలో 17 మంది, ఇల్లందులో 9 మంది, మణుగూరులో 21 మంది, భూపాలపల్లిలో 476 మంది, రామగుండం-1 ఏరియాలో 563 మంది, రామగుండం-2 ఏరియాలో 50 మంది, రామగుండం-3, అడ్రియాల ప్రాజెక్టు ఏరియాలో 240 మంది, శ్రీరాంపూర్ ఏరియాలో 655 మంది, మందమర్రి ఏరియాలో 299 మంది, బెల్లంపల్లిలో 9 మందిని రెగ్యులరైజ్ చేయనున్నారు.