ప్రధాని చేతికి బాలాపూర్ లడ్డూ
Balapur Ganesh Laddu : బాలాపూర్ లడ్డూ మరోమారు రికార్డు ధర పలికింది. గత ఏడాది కంటే అధికంగా ధరకు ఈ లడ్డూ కొనుగోలు చేశారు. రూ. 30 లక్షల ఒక వేయి రూపాయలకు బీజేపీ నేత కొలను శంకర్ రెడ్డి దీనిని కొనుగోలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంతో ప్రతిష్టాత్మకమైన ఈ లడ్డూను దేశ ప్రధాని మోదీకి అందిస్తానని ఆయన తెలిపారు. త్వరలోనే ఢిల్లీకి వెళ్లి పూర్తి లడ్డూను ఆయనకు అందిస్తానని వెల్లడించారు.
బాలాపూర్ గణేశ్ లడ్డూ ఈ ఏడాది గతేడాది కన్నా మూడు లక్షలు ఎక్కువ పలికింది. ఈసారి 30 లక్షల ఒక వెయ్యి రూపాయలకు కొలను శంకర్ రెడ్డి గణేశుడి లడ్డూను సొంతం చేసుకున్నారు. కిందటి సంవత్సరం దాసరి దయానంద్ రెడ్డి రూ.27 లక్షలకు స్వామి వారి లడ్డూను వేలంలో దక్కించుకున్నారు. ఖైరతాబాద్ మహాగణపతి తరువాత భాగ్యనగరంలో అందరి దృష్టిని ఆకర్షించేది బాలాపూర్ గణేశుడు. ప్రతీయేటా ఇక్కడ లడ్డూ ధర రికార్డు స్థాయి ధర పలుకుతుంది. బాలాపూర్ గణేషుడి లడ్డూను దక్కించుకునేందుకు భక్తులు పోటీ పడుతుంటారు. ఇక్కడి లడ్డూను దక్కించుకుంటే సిరిసంపదలు కలుగుతాయని భక్తుల విశ్వాసం.