కొనసాగుతున్న ఆదివాసీల బంద్
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆదివాసీల బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది. జైనూరు లో ఆదివాసీ మహిళపై అఘాయిత్యానికి పాల్పడిన వ్యక్తిని ఉరి తీయాలనే డిమాండ్ తో ఇవ్వాళ రాష్ట్ర వ్యాప్త బంద్ కు ఆదివాసి హక్కుల పోరాట సమితి పిలుపునిచ్చింది. దీనితో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో బంద్ కొనసాగుతోంది. చాలాచోట్ల ప్రజలు స్వచ్ఛందంగా తమ షాపులు మూసివేసి బంద్ పాటిస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లాకేంద్రంలోని బస్టాండ్ ముందు ఆదివాసీలు ధర్నా నిర్వహించారు. బస్సులు బయటకి వెళ్లకుండా గేటు ముందు తుడుం దెబ్బ నాయకులు బైఠాయించారు. ఇచ్చోడ, ఆదిలాబాద్, ఉట్నూర్, ఇంద్రవెల్లి మండలాల్లో ప్రశాంతంగా బంద్ కొనసాగుతోంది. ఇచ్చోడ లో పోలీసులు కవాతు నిర్వహించారు.
కొమురం భీం జిల్లాలో సైతం బంద్ కొనసాగుతోంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జిల్లా కేంద్రంలో భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. బంద్ పిలుపు మేరకు పాఠశాలలు, వ్యాపారస్తులు దుకాణాలు మూసివేసి బంద్ పాటిస్తున్నారు. ఏజెన్సీ ప్రాంత మండలాల్లో భారీగా పోలీస్ బందోబస్తు నిర్వహిస్తున్నారు. పోలీసులు ఎప్పటికప్పుడు పరిస్థితి సమీక్షిస్తున్నారు.
మంచిర్యాల జిల్లాలో సైతం ఆదివాసీల బంద్ సంపూర్ణంగా కొనసాగుతోంది. తాండూరు, కాసిపేట తదితర ప్రాంతాల్లో ఆదివాసీ సంఘాల నేతలు ఆందోళనకు దిగారు. తెరిచి ఉన్న షాపుల వద్దకు వెళ్లి బంద్కు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. దీంతో షాపులు మూతపడ్డాయి.