ప్రాయశ్చిత్త దీక్ష తీసుకున్న పవన్ కల్యాణ్
pawan kalyan deeksha : జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టారు. గుంటూరు జిల్లా నంబూరులోని శ్రీ దశావతార వేంకటేశ్వర స్వామి దేవాలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అర్చకుల వేదమంత్రాల మధ్య శ్రీ దశావతార వెంకటేశ్వర స్వామి దివ్య క్షేత్రంలో పవన్ కల్యాణ్ మాలధారణ స్వీకరించారు. 11 రోజులు ప్రాయశ్చిత్త దీక్షను పవన్ కల్యాణ్ చేయనున్నారు.
అనంతరం పవన్ కల్యాణ్ మీడియాతో మాట్లాడుతూ.. తిరుపతి లడ్డూకి 300 ఏళ్ల చరిత్ర ఉంది. గత ప్రభుత్వాన్ని నిందించడానికో.. రాజకీయ లబ్ధికోసమో కాదు. స్వామివారి పూజా విధానాలు మార్చేశారు. శ్రీవాణి ట్రస్ట్ ద్వారా డబ్బులు వసూలు చేశారు. 10వేలు వసూల్ చేసి రశీదు 500కి ఇచ్చేవారు. వైసీపీ పాలనలో 200 గుడులు ధ్వంసం చేశారు. రామతీర్థంలో శ్రీరాముడు విగ్రహం తల నరికేశారు. అంతర్వేదిలో రథం తగులపెట్టేశారు. అప్పుడు కూడా నా ఆవేదన వ్యక్తం చేశాను. తిరుమలలో ప్రసాదాలు కల్తీ జరుగుతుంది. అధిక డబ్బులు వసూల్ చేస్తున్నారని నేను ముందు నుంచే చెప్తున్నా. కానీ, ఈ స్థాయిలో కల్తీ జరుగుతుందని ఊహించలేదని పవన్ కల్యాణ్ అన్నారు.
తిరుమల శ్రీవారి ఆలయంలో పవిత్రమైన లడ్డూ ప్రసాదంలో వైసీపీ ప్రభుత్వం హయాంలో జంతు అవశేషాలు, చేపనూనె కలిపి అపవిత్రం చేశారని ల్యాబ్ రిపోర్టులు రావడం దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు అవశేషాలు ఉన్నాయని తెలిసిన తరువాత మనసు కలత చెందిందని పవన్ కల్యాణ్ తెలిపారు. కలియుగ ప్రత్యక్ష దైవం వేంకటేశ్వరస్వామి పట్ల ఇది నిజంగా ఘోర అపచారం అని, సనాతన ధర్మాన్ని విశ్వసించే ప్రతిఒక్కరూ దీనికి ప్రాయశ్చితం చేసుకోవాల్సిందేనని పేర్కొన్నారు. ఈ క్రమంలో తాను 11 రోజుల పాటు ప్రాయశ్చిత్త దీక్ష చేపడుతున్నానని పవన్ ప్రకటించారు.