కాంగ్రెస్ మోసంపై ఆందోళన
టీబీజీకేఎస్ రాష్ట్రఅధ్యక్షుడు రాజిరెడ్డి పిలుపు

లాభాల వాటా పేరిట కాంగ్రెస ప్రభుత్వం సింగరేణి కార్మికులను మోసం చేసిందని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి పిలుపునిచ్చారు. లాభాల వాటా పంపిణీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా ఆందోళన బాట పట్టనున్నట్లు వెల్లడించారు. ఈ నెల 23న కార్మికులు నల్ల బ్యాడ్జీలు ధరించాలని, 24న రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మలను దగ్ధం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. 25న జీఎం కార్యాలయాల ఎదుట ధర్నా నిర్వహించి, వినతి పత్రం సమర్పించాలన్నారు. 26న గనులపై కార్మికుల సంతకాలను సేకరించి ఆయా నియోజకవర్గాల శాసనసభ్యులకు పంపించాలన్నారు. అదే విధంగా హైదరాబాదులోని సింగరేణి భవన్ ఎదుట ధర్నా చేయాలని నిర్ణయించినట్లు ఆయన వెల్లడించారు. లాభాల వాటా 33 శాతం అని చెప్పి కోత విధించడం దారుణమన్నారు. కార్మికులను ఆశలను సర్కారు అడియాశలు చేసిందని మండిపడ్డారు.