చెరువులోనే అక్రమ నిర్మాణం.. బాంబులతో పేల్చేశారు..
చెరువులు, కుంటలు పూడ్చి ఇండ్లు, భవనాలు నిర్మించుకోవడం చూస్తున్నాం… కానీ ఓ వ్యక్తి ఏకంగా చెరువులోనే భవనం కట్టేశాడు.. అది కూడా వారాంతాల్లో కుటుంబంతో పాటు గడిపేందుకు ఇక్కడి వస్తుంటాడు.. దానికోసం నిర్మాణం చేపట్టాడు. బిల్డింగ్‌లోకి వెళ్లేందుకు ఒడ్డునుంచి చిన్నపాటి బ్రిడ్జి కూడా కట్టించుకున్నాడు..
రాష్ట్రవ్యాప్తంగా అక్రమనిర్మాణాల తొలగింపులో భాగంగా సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం మల్కాపూర్‌లో అక్రమనిర్మాణాలను గుర్తించిన అధికారులు దానిని కూల్చేశారు. మల్కాపూర్‌లో చెరువులోనే ఈ బహుళ అంతస్తుల భవనాన్ని కొందరు కట్టినట్లు గుర్తించారు. సికింద్రాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి 12 సంవత్సరాల క్రితం మల్కాపూర్ పెద్ద చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో ఈ భవనాన్ని నిర్మించారు. ఒకటీ రెండు కాదు నాలుగు అంతస్తుల భవనాన్ని నిర్మించాడు. చెరువు నీళ్లలో అడుగు పెట్టకుండా భవనంలోకి చేరుకునేలా, కొంతదూరం నుంచే మెట్లు కట్టారు. ఈ బహుళ అంతస్తుల భవన యజమాని కుటుంబసభ్యులు వారాంతాల్లో వచ్చి ఇక్కడ సేదతీరుతూ ఉండేవారు.
ఇదంతా ఎఫ్టీఎల్ ప్రాంతమని, ఈ భారీ భవనాన్ని చెరువులోనే నిర్మించారని, దీంతో వారికి నోటీసులు ఇచ్చామని అధికారులు వెల్లడించారు. ఈ భవనం కూల్చివేతకు సమయం కూడా ఇచ్చామని ఇవాళ బాంబులతో కూల్చివేశామని చెప్పారు. చెరువులోకి ఏ వాహనం వెళ్లదని, అందుకే బాంబుల ద్వారా నేలమట్టం చేశామని అధికారులు స్పష్టం చేశారు. 12 ఏళ్ల కిందట చెరువులో నాలుగు అంతస్తుల బిల్డింగ్ కట్టగా.. అధికారులు ఇంతకాలం ఏంచేస్తున్నారని నెటిజన్లు నిలదీస్తున్నారు.