మన నిర్మల్‌కు కేంద్ర అవార్డు..
Telangana Awadrs : 2024 సంవత్సరానికి కేంద్ర పర్యాటక శాఖ ప్రకటించిన అవార్డుల్లో మన రాష్ట్రానికి రెండు అవార్డులు దక్కాయి. కేంద్ర పర్యాటక శాఖ ఎనిమిది కేటగిరీలలో పోటీలు నిర్వహించగా, “క్రాఫ్ట్స్” కేటగిరీలో ఉత్తమ గ్రామంగా నిర్మల్, “స్పిరిచ్యువల్ – వెల్నెస్ ” కేటగిరీలో నాగర్ కర్నూల్ జిల్లా సోమశిల గ్రామం ఎంపికైంది. శుక్రవారం ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ అధ్యక్షతన ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో అవార్డుల ప్రదానోత్సవం చేశారు. ఉత్తమ పర్యాటక గ్రామాలుగా నిర్మల్, సోమశిల ఎంపికైన నేపథ్యంలో ఆ గ్రామాలకు చెందిన అధికారులు అవార్డులను అందుకున్నారు. నిర్మల్ జిల్లా నుంచి అడిషనల్ కలెక్టర్ ఫైజాన్ అహ్మద్, నిర్మల్ టాయ్స్, ఆర్ట్స్ సొసైటీ అధ్యక్షుడు ఎస్.పెంటయ్య సోమశిల నుంచి పర్యాటక శాఖ అధికారి టి.నర్సింహా ఈ అవార్డులను అందుకున్నారు.
నిర్మల్ పట్టణం కొయ్యబొమ్మలకు ప్రసిద్ధి. దీనికి సుమారు 400 సంవత్సరాల చరిత్ర ఉంది. కర్రలతో కొయ్యబొమ్మలు చేయడం ఇక్కడి ప్రత్యేకత. కర్రలను సేకరించడం, వాటిని ఆరబెట్టి తగిన రుపాలకు చెక్కి బొమ్మలుగా తీర్చిదిద్దడం, వాటికి పెయింటింగ్ చేయడం, విక్రయించడం కొందరు తరతరాలుగా చేస్తున్నారు. పక్షులు, జంతువులు, ఫలాలలాంటి కొయ్యబొమ్మలకే కాకుండా వర్ణచిత్రాలకు కూడా నిర్మల్ పేరుగాంచింది. 1830ల్లో ఈ ప్రాంతాన్ని దర్శించిన యాత్రా చరిత్రకారుడు ఏనుగుల వీరాస్వామయ్య నిర్మల్ బొమ్మల గురించి చాలా రాశారు. నిర్మల్ బొమ్మలు, పంచపాత్రలు వంటివి చాలా ప్రసిద్ధమైనవని పేర్కొన్నారు. 1955లో నిర్మల్ కొయ్యబొమ్మల సహకార సంస్థను ఏర్పాటు చేశారు. వీటికి రాష్ట్రపతి అవార్డు కూడా లభించింది.