చిన్న నేతలతో చిక్కులు..
ఆయనో ఎమ్మెల్యే.. ఆయన చెప్పినట్టు నియోజకవర్గ నాయకులు వినాలి.. కానీ ఇక్కడ అలా జరగడం లేదు. తమకు నచ్చినట్లు చేసుకుంటూ వెళ్తున్నారు. ఆ ఎమ్మెల్యే ఎన్నిమార్లు చెప్పినా ఆయన మాట పట్టించుకోవడం లేదు. పైగా ఆయన పర్యటన బహిష్కరించి ఆయననే బ్లాక్మెయిల్ చేసే స్థాయికి ఎదిగారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ద్వితీయ శ్రేణి నేతలతో ఆ ఎమ్మెల్యేకు తలనొప్పులు, చికాకులు తప్పడం లేదు.. ఇంతకీ ఎవరా ఎమ్మెల్యే…? ఏంటా తలనొప్పులు…? నాంది న్యూస్ ప్రత్యేక కథనం..
చెన్నూరు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు నేతలు, ద్వితీయ శ్రేణి నాయకత్వం చేస్తున్న అవినీతి అక్రమాలు ఎమ్మెల్యే గడ్డం వివేక్కి తలనొప్పులుగా మారాయి. ఆయనేమో అవినీతి, అక్రమాలకు దూరంగా ఉండాలని ప్రతిసారి హితవు పలకడం కింది స్థాయి నాయకత్వం వాటిని పెడచెవిన పెట్టి తమ పనులు తాము చేసుకుంటూ పోతున్నారు. అది కాస్తా ఎమ్మెల్యేకి తలనొప్పిగా మారింది. అన్ని దందాల్లో వారే తలదూర్చడంతో వివేక్కు ఏం చేయాలో పాలుపోని దుస్థితి నెలకొంది. ఈ మధ్య కాలంలో వరుసగా జరిగిన పరిణామాలు అటు ఎమ్మెల్యేకి, అటు పార్టీకి చెడ్డపేరు తీసుకువచ్చాయి.
షాడో ఎమ్మెల్యేతో పరేషాన్..
చెన్నూరు నియోజకవర్గంలో ఓ నేత ఏకరంగా షాడో ఎమ్మెల్యే మాదిరిగా వ్యవహరిస్తున్నారు. బియ్యం దందా, ఇసుక దందాతో పాటు ఎన్నో రకాలుగా వ్యవహారాలు నడిపిస్తున్నారు. వేరే ఎవరైనా పనులు చేయాలన్నా, ఏదైనా దందా చేయాలన్నా అయనకు ట్యాక్స్ కట్టాల్సిందేనని ప్రచారం సైతం సాగుతోంది. ఇక కేసులు పోలీస్ స్టేషన్ వరకు వెళ్లకుండా సెటిల్మెంట్లు సైతం చేస్తున్నారు. చెన్నూరు, బీమారం, కోటపల్లి ప్రాంతాల్లో ఆయన చెప్పిందే వేదం… చేసిందే చట్టం అన్న చందంగా తయారయ్యింది పరిస్థితి. ఆయనే కాకుండా, మరికొందరు నేతలు సైతం ఒంటెద్దు పోకడలతో సామాన్య జనం ఇబ్బందులు పడుతున్నారు. రామకృష్ణాపూర్‌లో ఓ నేత ఏకంగా చెరువును ఆనుకుని భవనాన్ని నిర్మించారు.
వరుస ఘటనలతో తలనొప్పులు..
ఈ మధ్య కాలంలో చెన్నూరు నియోజకవర్గంలో జరుగుతున్న ఘటనలు సైతం అటు ఎమ్మెల్యే వివేక్కు, ఇటు పార్టీకి తీవ్ర ఇబ్బందులు సృష్టిస్తున్నాయి. శనిగకుంట మత్తడి పేల్చివేతలో కాంగ్రెస్ నేతలు ప్రధాన సూత్రధారులు కావడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. మొదట దీనిని నీరుగార్చేందుకు ప్రయత్నాలు చేసినా పోలీసు ఉన్నతాధికారులు ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకోవడంతో కేసు నమోదు అయ్యింది. పొన్నారం గ్రామ పంచాయతీ కార్యదర్శిపై కాంగ్రెస్ నేత దుర్భాషలాడటం కూడా వివాదానికి దారి తీసింది. ఈ ప్రాంతానికి చెందిన ఓ జంటకి రెండేళ్ల కిందట పెళ్లి జరిగింది. వధువు అప్పుడు మైనర్ కావడంతో, ఇప్పుడు కళ్యాణలక్ష్మికి దరఖాస్తు చేసుకున్నారు. అయితే, మ్యారేజ్ సర్టిఫికేట్ ఇవ్వాలని కాంగ్రెస్ నేతలు ఒత్తిడి తెచ్చారు. ఇష్టం వచ్చినట్లు దుర్భాషలాడటంతో ఆమె ఏకంగా పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత ఆమెపై ఒత్తిడి తేవడంతో ఆమె ఫిర్యాదు ఉపసంహరించుకున్నారు.
వర్గపోరుతో సతమతం..
ఇక చెన్నూరు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీలో వర్గపోరు కొనసాగుతోంది. చెన్నూరు పట్టణంలో హిమవంత్ రెడ్డి, మూల రాజిరెడ్డి మధ్య వర్గపోరు కొనసాగుతోంది. ఇక, కోటపల్లిలో మూల రాజిరెడ్డి పురాణం సతీష్ వర్గాలుగా నేతలు విడిపోయారు. నియోజకవర్గం మొత్తం పాత, కొత్త నేతల వర్గాల మధ్య విబేధాలు కొనసాగుతున్నాయి. బీమారం మండలంలో ముచ్చటగా మూడు వర్గాలు కొనసాగుతున్నాయి. చేకుర్తి సత్యనారాయణది ఒక వర్గం కాగా, పొడేటి రవి తదితరులంతా మరో వర్గంగా సాగుతున్నారు. చెరువుకట్టను కబ్జా నుంచి కాపాడాలని చేకుర్తి సత్యనారాయణ వర్గం కలెక్టర్‌కు ఫిర్యాదు చేసింది. మరో వర్గం కబ్జాదారులను కాపాడే ప్రయత్నం చేయడంతో పాటు, 70 మందిన కాపాడాలని, వారికి ఉపాధి కల్పించాలని ఎమ్మెల్యేను కోరుతున్నారు.
ఇలా నేతల ఇష్టారాజ్యం, వర్గపోరుతో ఎమ్మెల్యే వివేక్‌కు తలనొప్పి తప్పడం లేదు. మరి ఈ ద్వితీయ శ్రేణి నాయకత్వం విషయవంలో ఆయన ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి మరి…