గ్రూప్ 1 పరీక్షలకు లైన్ క్లియర్

Group-1 exam: తెలంగాణలో గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు యధాతదంగా జరగనున్నాయి. పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. పరీక్షల నిర్వహణను వాయిదా వేయాలని కోరుతున్న అభ్యర్థులు జీవో 29పై సుప్రీంకోర్టును ఆశ్రయించారు. గ్రూప్-1 బాధితుల పిటిషన్‌పై విచారణ చేపట్టిన చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ప్రస్తుత పరిస్థితుల్లో పరీక్షలను వాయిదా వేయలేమని పేర్కొంది. భారత అత్యున్నత న్యాయస్థానం తీర్పుతో టీజీపీఎస్సీ ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు జరగనున్నాయి. మధ్యాహ్నం 2 గంటలకు పరీక్షలు ప్రారంభం కావాల్సి ఉండగా కోర్టు తీర్పు ఎలా ఉంటుందనేదానిపై ఓ వైపు పరీక్షలకు హాజరుకానున్న అభ్యర్థులతో పాటు.. వాయిదా కోరుతున్న అభ్యర్థుల్లో టెన్షన్ నెలకొన్న వేళ.. న్యాయస్థానం తీర్పుతో గ్రూప్-1 మెయిన్స్ పరీక్షకు లైన్ క్లియర్ అయింది. జీవో29తో రిజర్వు అభ్యర్థులు నష్టపోతారని కొందరు గ్రూప్-1 అభ్యర్థులు చెబుతుండగా.. ఎవరికి ఎలాంటి నష్టం ఉండబోదని ప్రభుత్వం చెబుతోంది.. పరీక్షల నిర్వహణను వాయిదా వేయాలని కొందరు అభ్యర్థులు సుప్రీంను ఆశ్రయించగా.. కోర్టు పరీక్షల వాయిదాకు నిరాకరించింది.

తెలంగాణలో గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షల కోసం టీజీపీఎస్సీ పూర్తి ఏర్పాట్లు చేసింది. అక్టోబర్ 21 నుంచి 27వ తేదీ వరకు మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి. గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలకు 31,383 మంది అభ్యర్థులు హాజరుకానున్నారు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల్లో 46 పరీక్షా కేంద్రాల ఏర్పాటు చేశారు. హైదరాబాద్ జిల్లాలో 8, రంగారెడ్డి జిల్లాలో 11, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 27 పరీక్ష కేంద్రాలను టీజీపీఎస్సీ ఏర్పాటుచేసింది. అన్ని కేంద్రాల వద్ద ఏవిధమైన అవకతవకలు, అవాంఛనీయమైన సంఘటనలు జరగకుండా గట్టి బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు పోలీసు శాఖ తెలిపింది. పరీక్షల నిర్వహణను జిల్లా కలెక్టర్లు పర్యవేక్షిస్తారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like