మా రైల్వే స్టేషను సమస్యలు పరిష్కరించండి
రైల్వే జీఎంను కలిసిన ఎమ్మెల్యే, నాయకులు
రేచిని రైల్వేస్టేషను సమస్యలు పరిష్కరించాలని బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్, కాంగ్రెస్ నాయకులు కోరారు. దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సికింద్రాబాద్ అరుణ్ కుమార్ జైన్ ని కలిసి పలు అంశాలపై చర్చించారు. రేచిని రోడ్ రైల్వే స్టేషన్ ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణం పొడిగింపు, గతంలో ఉన్న సింగరేణి, రామగిరి ట్రైన్ హాల్టింగ్ సౌకర్యంతో పాటు మౌలిక సదుపాయాల గురించి మాట్లాడారు. వెంటనే స్పందించిన రైల్వే మేనేజర్ అరుణ్ కుమార్ సానుకూలంగా స్పందించి అధికారులతో మాట్లాడి వెంటనే పనులు ప్రారంభించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో తాండూర్ మండల్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సూరం రవీందర్ రెడ్డి, గట్టు మురళీధర్, సాలిగామ బానయ్య పాల్గొన్నారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ సమస్యల విషయంలో రైల్వే అధికారుల దృష్టికి తీసుకువెళ్లిన ఎమ్మెల్యే వినోద్ కి, రైల్వే జనరల్ మేనేజర్, ఇతర అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. రైల్వే ఓవర్ బ్రిడ్జి పొడిగిస్తే ప్రజలకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుందన్నారు. ఇక్కడ రైళ్ల నిలిపివేతతో ఎన్నో మండలాల ప్రజలకు సౌకర్యవంతంగా ఉంటుందన్నారు.