వద్దు రా నాయనా.. ఇథనాల్ పరిశ్రమ..
-నిర్మల్ జిల్లాలో ఆగని ఇథనాల్ పోరు
-100వ రోజుకు రైతుల దీక్ష
Endless Ethanol War in Nirmal District:నిర్మల్ జిల్లా దిలావర్పూర్, గుండంపల్లి గ్రామాల మధ్య నెలకొల్పనున్న ఇథనాల్ ఫ్యాక్టరీ వద్దంటూ ప్రజలు చేస్తున్న ఆందోళన 100వ రోజుకు చేరుకుంది. దిలావర్ పూర్ నుండి కాల్వ నరసింహ స్వామి గుడికి పాదయాత్ర చేసిన రైతులు వంటా వార్పు నిర్వహించారు. ఈ ఇథనాల్ పరిశ్రమ రద్దు చేయాలని, అప్పటి వరకూ తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు.
తమ ప్రాంతంలో ఇథనాల్ పరిశ్రమ వద్దంటూ ప్రజలు వంద రోజులుగా వివిధ రకాల నిరసనలు, ఆందోళనలు కొనసాగిస్తున్నారు. ఈ సమస్యపై ఇప్పటికి గ్రామస్థాయి నుంచి ముఖ్యమంత్రి స్థాయి వరకు కలిసి సమస్యను వివరించారు. ప్రజారోగ్యన్ని దెబ్బతీసే పరిశ్రమను ప్రజాభిప్రాయ సేకరణ లేకుండా ఏర్పాటు చేయడం భావ్యం కాదని, వ్యవసాయం పని ఆధారపడి ఉన్న ఈ ప్రాంతంలో రైతులకు జీవనోపాధి లేకుండా ఫ్యాక్టరీ నిర్మించడం సమంజసం కాదని హెచ్చరిస్తున్నారు. శాసనసభ ఎన్నికలకు ముందు ప్రస్తుత పాలకులు , ఎన్నో హామీలు ఇచ్చి నిర్మాణ పనులు నిలిపివేసి, మళ్లీ తిరిగి ప్రారంభించడం పట్ల తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. ఈ పరిశ్రమ ఏర్పాటైతే భావితరాలకు ఇబ్బందులు తప్పవని ఆందోళన చేస్తున్నారు
గతంలో ఇథనాల్ పరిశ్రమను వ్యతిరేకిస్తూ గుండంపెల్లి, దిలావర్‌పూర్, న్యూలోలం, సముందర్‌పెల్లి గ్రామాలకు చెందిన దాదాపు 10 వేల మంది రైతులు, ప్రజలు ఫ్యాక్టరీ వద్ద ఆందోళన చేపత్తారు. పరిశ్రమల లోపలికి చొచ్చుకెళ్లి గోడలు, సామగ్రి, షెడ్లను కూల్చివేసి టిప్పర్ల అద్దాలను ధ్వంసం చేశారు. అక్కడున్న స్కార్పియో వాహనానికి నిప్పుపెట్టారు. ప్రజల ఆందోళనల నేపధ్యంలో ఇప్పటికీ ముగ్గురు జిల్లా కలెక్టర్లు గ్రామానికి వెళ్లి గ్రామస్థులతో చర్చలు జరిపారు. అయినా రైతులు, ప్రజలు తమ పట్టువిడవడం లేదు.
ఇథనాల్ పరిశ్రమ ఏర్పాటుతో భవిష్యత్తులో ఎన్నో సమస్యలు ఎదురవుతాయని ప్రజలు అంటున్నారు. ప్రభుత్వం దీనిని పరిగణనలోకి తీసుకొని వీలైనంత త్వరగా పరిశ్రమను నిలిపేయాలంటూ కోరుతున్నారు. లేకపోతే పరిశ్రమ మూసే వరకు తమ పోరాటాలను ఉద్ధృతం చేస్తామని హెచ్చరిస్తున్నారు.