ఇంకా ఆసుపత్రుల్లోనే విద్యార్ధులు
ఫుడ్ పాయిజన్(Food poisoning)కు గురైన విద్యార్ధులు ఇంకా ఆసుపత్రుల్లోనే చికిత్స పొందుతున్నారు. వాంకిడి మండల కేంద్రంలోని గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ ఆయిన విషయం తెలిసిందే. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థుల్లో వాంకిడి మండలంలోని సావాతి గ్రామానికి చెందిన శైలజ పరిస్థితి విషమంగా ఉన్నట్లు స్థానికులు తెలిపారు. ప్రస్తుతం ఆమె మంచిర్యాలలోని ఓ ప్రైవేటు దవాఖానాలో వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్నట్లు సమాచారం. ఆమెతో పాటు మరో ముగ్గురు పిల్లలున్నప్పటికీ వారి ఆరోగ్యం నిలకడగానే ఉంది. మరో 12 మంది విద్యార్థులు ఆసిఫాబాద్ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు సమాచారం.
వంటగది, వంట సామగ్రి అపరిశుభ్రతతో పాటు, తాగునీరు కలుషితం కావడంతోనే అస్వస్థతకు గురైనట్లు ఆదివాసీ సంఘాల నాయకులు చెబుతున్నారు. వాటర్ ట్యాంక్ నెలల తరబడి శుభ్రం చేయకుండా నీరు అందిస్తున్నారని అస్వస్థతకు గురైన విద్యార్థినిలు వాపోయారు.
ఇలాంటి ఘటనలు తరుచూ జరుగుతున్నా బయట రాకుండా సిబ్బంది జాగ్రత్తపడుతున్నారని ఆరోపణలున్నాయి. వార్డెన్ స్థానికంగా ఉండడం లేదని దీంతో హాస్టల్ పర్యవేక్షణ లేక విద్యార్థినిలు ఇబ్బందులు పడుతున్నారని స్థానికులు పేర్కొన్నారు.