ఎమ్మెల్యే హౌస్ అరెస్ట్
-తుడుం దెబ్బ నాయకులను అదుపులోకి తీసుకున్న పోలీసులు
-బంద్ కి పిలుపునిచ్చిన విద్యార్థి, యువజన, సామాజిక సంఘాలు
-పోలీసుల హై అలెర్ట్
కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మీని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. వాంకిడి మండల కేంద్రంలోని ఆశ్రమ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ తో విద్యార్థిని శైలజ మృతి చెందిన విషయం తెలిసిందే. ఆమె కుటుంబాన్ని ఓదార్చడానికి వెళ్తున్న ఎమ్మెల్యే కోవ లక్ష్మీని బయటికి వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. ఇది పోలీసుల దౌర్జన్యం అంటూ బిఆర్ఎస్ నాయకులు ఆందోళన చేపట్టారు. పెద్దఎత్తున ఆందోళనలు జరిగే అవకాశం ఉన్న నేపధ్యంలో ఆమెను ముందస్తుగానే హౌస్ అరెస్టు చేశారు.
తుడుం దెబ్బ నాయకుల అరెస్టు
వాంకిడి మండలం కొమురం భీమ్ చౌక్ వద్ద ఉన్న తుడుం దెబ్బ నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. శైలజ అనే విద్యార్థిని మృతికి పాఠశాల యాజమాన్యం, అధికారులు, ప్రభుత్వ వైఫల్యం కారణమన్నారు. తుడుం దెబ్బ నాయకులు. ఆమె కుటుంబ సభ్యులకు నష్టపరిహారం చెల్లించడంతో పాటు విద్యార్థిని కుటుంబంలో ఒకరికి ఉద్యగం కల్పించాలని శాంతియుతంగా నిరసన చేస్తుంటే అరెస్టులు చెయ్యడం ఏమిటని ప్రశ్నించారు. జిల్లా పోలీసు యంత్రాంగం నాయకులను అక్రమంగా అరెస్టు చేసి కాగజ్ నగర్ పోలీస్ స్టేషన్ తరలించడం సబబు కాదన్నారు. వారిని వెంటనే విడుదల చేయకుంటే ఉమ్మడి జిల్లాల కమిటీ తీవ్ర నిరసనకు దిగుతుందని ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుం దెబ్బ హెచ్చరించింది.
ప్రభుత్వం, అధికారులే భాద్యులు
శైలజ మృతికి ప్రభుత్వం, అధికారులే భాద్యత వహించాలని విద్యార్థి, యువజన, సామాజిక సంఘాలు గిరిజన సంఘాలు కోరాయి. KVPS, DYFI, PDSU, AIYF, SFI నేతలు
కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో విద్యా సంఘాల బంద్ కి పిలుపునిచ్చారు. ఆశ్రమ పాఠశాలలో సంఘటన జరిగిన తర్వాత కొంతమంది అధికారులని సస్పెండ్ చేసి చేతులు దులుపుకున్నారని దుయ్యబట్టారు ఐటిడిఓ పిఓ డిటిడిఓ ఏటిడిఓలను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. సంఘటనకు బాధ్యులైన హెచ్ఎం, వార్డులను సర్వీస్ నుంచి తొలగించాలన్నారు.