అటు వెతుకులాట… ఇటు దాడి..
Tiger Attack: ఓ వైపు పులి జాడ కోసం అధికారులు వెతుకుతుండగా, మరోవైపు పులి ఓ రైతుపై దాడి చేసింది. సిర్పూర్ టీ మండలం దుబ్బ గూడ శివారులో కంది చేనులో వ్యవసాయపనులు చేస్తున్న సమయంలో రౌతు సురేష్ అనే రైతుపై దాడి చేసింది. తీవ్రగాయాలు కావడంతో వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించారు. నిన్న (శుక్రవారం) కాగజ్నగర్ మండలం గన్నారంలో మోర్లె లక్ష్మి (22) అనే మహిళపై దాడి చేసింది. దీంతో లక్ష్మి చనిపోయింది. తాజాగా రైతుపై దాడితో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. బయటకు వెళ్లాలంటేనే జంకుతున్నారు. కాగజ్నగర్ మండలం ఇస్ గాం బెంగాలీ క్యాపుల్లో ఇంకా పులి భయం వీడటం లేదు. .భయంతో గ్రామస్తులు పనులకు సైతం వెళ్లడం లేదు. అటవిశాఖ అధికారులు డ్రోన్ సాయంతో పులిని గుర్తించే పనిలో ఉండగానే ఆ పులి రైతు దాడిచేయడం గమనార్హం.
కాగజ్నగర్ మండలం ఈసాగామ్, విలేజ్ నెం 1,3,5,8,9,10, నజ్రూల్ నగర్, సీతానగర్, అనుకోడా, గన్నారం, కడంబా, ఆరెగూడ, బాబూనగర్ గ్రామాల పరిసర ప్రాంతాలలో పులి సంచారం ఉన్నందున ఆ గ్రామాల ప్రజలు వ్యవసాయ భూమి, అడవి పరిసర ప్రాంతాలకు వెళ్ళకూడదని అధికారులు 144 సెక్షన్ విధించారు. దీంతో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితుల్లో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.