బ్రేకింగ్: హస్తం గూటికి సోయం బాపురావు, ఆత్రం సక్కు

Soyam Bapurao, Atram Sakku into Congress: మాజీ ఎంపీ సోయం బాపురావు, మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు కాంగ్రెస్ పార్టీలో చేరారు. పీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ సమక్షంలో కాంగ్రెస్ కండువు కప్పుకున్నారు. తాను బీజేపీ పార్టీకి రాజీనామా చేశానని, సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్న అభివృద్ధి పనులకు ఆకర్షితున్ని అయ్యానని చెప్పారు. అన్నీ మతాలకు నేను గౌరవిస్తానని, కాంగ్రెస్ సిద్ధాంతాలకు కట్టుబడి పని చేస్తానని స్పష్టం చేశారు.

పార్లమెంట్ సభ్యుడిగా పని చేసిన సోయం బాపూరావుకి గత ఎన్నికల్లో బీజేపీ టికెట్ నిరాకరించింది. ఆయన ఎన్నికలకు ముందే పార్టీ మారతారనే ప్రచారం సాగింది. ఆదివాసీ తెగలకు చెందిన సోయం బాపూరావు ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ ఆదిమ గిరిజనులను ఏకం చేసే తుడుందెబ్బ ఉద్యమానికి నాయకత్వం వహించి రాజకీయాల్లోకి వచ్చారు. 2004లో కేసీఆర్ పై ఒక సందర్భంలో తిరుగుబాటు చేసి టీఆర్ఎస్ టికెట్ సాధించి విజయం సాధించారు. ఆ తర్వాత అనేక ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు.

రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా ఎప్పటికప్పుడు తన పంథా మార్చుకుంటూ సోయం బాపూరావు ముందుకు సాగుతున్నారు. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున బోథ్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి స్వల్ప తేడాతో ఓడిపోయారు. అనూహ్య పరిణామాల నేపథ్యంలో నెలల వ్యవధిలోనే బీజేపీలో చేరి ఆదిలాబాద్ పార్లమెంటు సభ్యుడిగా గెలుపొంది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా రాజకీయాల్లో చరిత్ర సృష్టించారు. ఏ పార్టీలో ఉన్నా తాను నమ్ముకున్న ఆదివాసీల కోసం పనిచేస్తాడన్న పేరును ఆయన పొందారు. ఈ నేపథ్యంలోనే వచ్చే ఎన్నికల్లో తన రాజకీయ వ్యూహాన్ని సోయం బాపూరావు మార్చుకున్నట్లు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ప్రచారం మొదలైంది.

కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా తిర్యాణి మండలం లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన ఆత్రం సక్కు వృత్తి రీత్యా ఉపాధ్యాయుడు. 2009 వరకు అదే వృత్తిలో కొనసాగారు. 2009లో కాంగ్రెస్ అభ్యర్థిగా ఆసిఫాబాద్ నియోజకవర్గం నుంచి పోటీచేసి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2014 ఎన్నికల్లో ఓడిపోగా.. 2018లో మళ్లీ కాంగ్రెస్ అభ్యర్థిగా గెలిచి ఆ తర్వాత బీఆర్ఎస్లో చేరారు. 2024లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున ఆదిలాబాద్ ఎంపీగా పోటీచేసి ఓడిపోయారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరారు.

ఇద్దరు ఆదివాసీ నేతల చేరికతో కాంగ్రెస్ ఇక్కడ పుంజుకునే అవకాశం ఉందని పలువురు చెబుతున్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like