ఎంపీ వర్సెస్ ఎమ్మెల్యేలు
MP vs MLAs: పెద్దపల్లి పార్లమెంట్ని(Peddapally Parliament) నియోజకవర్గ పరిధిలో పరిస్థితి ఎంపీ, వర్సెస్ ఎమ్మెల్యేలుగా మారిందా.? ఎంపీ గడ్డం వంశీ తమ నియోజకవర్గంలో అడుగుపెట్టవద్దని ఎమ్మెల్యేలు కంకంణం కట్టుకున్నారా.? ఆయనను ఏ కార్యక్రమానికి పిలవడం లేదా.? దీంతో ఎంపీ అలిగారా…? అవుననే అంటున్నారు రాజకీయ పరిశీలకులు.. బయట ప్రచారం ఎలా ఉన్నా ఏకంగా ఎంపీనే ముఖ్యమంత్రి పాల్గొన్న నిండు సభలో తన అసంతృప్తి వెళ్లగక్కారు…
పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో ఎమ్మెల్యేలు ఎంపీ గడ్డం వంశీ(MP Gaddam Vamsi)ని తమ నియోజకవర్గంలో అడుగుపెట్టనివ్వడం లేదు. ఆయన అవసరమే తమకు లేదన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. దీంతో ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో ఎంపీ తన పని తాను చేసుకుపోతున్నారు. మంచిర్యాల నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రేంసాగర్ రావుకు మొదటి నుంచి గడ్డం వివేక్ అంటే పొసగదు. పైగా తన కొడుక్కి ఎంపీ టిక్కెట్టు విషయంలో ప్రేంసాగర్ రావుతో మాట్లాడారు. మొదట అంగీకరించని ఆయన ఆ తర్వాత సరే అన్నారు. ఈ సమయంలో మంత్రి పదవి విషయంలో మీకే మద్దతు చెబుతామని వివేక్ ప్రేంసాగర్ రావుకు హామీ సైతం ఇచ్చినట్లు సమాచారం. ఇప్పుడు ఆయన గెలిచాక మాత్రం పరిస్థితి తారుమారైంది. మంత్రి పదవి రేసులో తామూ ఉన్నామంటూ వివేక్, వినోద్ హైదరాబాద్ నుంచి ఢిల్లీ వరకు కాలికి బలపం కట్టుకుని తిరుగుతున్నారు.
ఈ నేపథ్యంలోనే ప్రేంసాగర్ రావు అటు ఇద్దరు ఎమ్మెల్యేలతో పాటు ఎంపీని సైతం దగ్గరకు రానివ్వడం లేదు. నియోజకవర్గంలో ఏ కార్యక్రమం నిర్వహించినా ఎంపీ వంశీకి ఆహ్వానం ఇవ్వడం లేదు. ఈ మధ్య కాలంలో జిల్లాలో మంత్రుల పర్యటన జరిగినా ఎంపీని పిలవలేదు. ఇక మిగతా చోట్ల కూడా ఎంపీ పరిస్థితి అదే విధంగా ఉంది. ప్రొటోకాల్ ప్రకారం ఎంపీని పిలవాల్సి ఉన్నా పిలవకపోవడం పట్ల ఆయన అనుచరులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అటు అధికారులు, ఇటు ఎమ్మెల్యేలు తమ నేతను పిలవకపోవడం పట్ల సోషల్ మీడియాలో క్యాపెంయిన్ సైతం నిర్వహించారు. అయినా, ఎమ్మెల్యేలు మాత్రం ఎంపీ వంశీని పిలవడానికి ససేమిరా అంటున్నారు.
రెండు రోజుల కిందట పెద్దపల్లిలో జరిగిన సీఎం రేవంత్ రెడ్డి సభలో అడ్మినిస్ట్రేషన్, ప్రోటోకాల్ ప్రకారం నన్ను పిలిచినా పిలువకపోయినా పెద్దపల్లి ప్రజల కోసం నేనెప్పుడూ మీ వెంటే ఉంటానని ఎంపీ గడ్డం వంశీ మాట్లాడం పై చర్చనీయాంశంగా అయ్యింది. సభా వేదికపై ఉన్న సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు ఒక్కసారిగా ఎంపి వంశీ వైపు చూశారు. ఈ నేపథ్యంలోనే పెద్దపల్లిలో పార్లమెంటు నియోజకవర్గంలో రాజకీయంగా ఏం జరుగుతోందని, అభివృద్ధి పనులు,అలాగే ప్రోటోకాల్, శిలాఫలకాలపై పేర్లు ఎలా పెడుతున్నారో సమాచారం కావాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను కోరినట్లు సమాచారం. ముఖ్యమంత్రి స్వయంగా దృష్టి పెట్టడంతో పరిస్థితి ఏమైనా మారుతుందా..? లేక ఎమ్మెల్యేలు అదే విధంగా ఎంపీని కార్యక్రమాలకు పిలవకుండా దూరం పెడతారా..? చూడాల్సిందే..