తెలంగాణ తల్లి విగ్రహం.. వివాదం..
Telangana Mother Statue Controversy: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తవుతోంది. ప్రజాపాలన విజయోత్సవాల పేరుతో వేడుకలు సైతం నిర్వహిస్తోంది. డిసెంబర్ 9న ప్రజాపాలన ఏడాది విజయోత్సవాల ముగింపు సందర్భంగా సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ చేయనుంది. అయితే, ఇప్పటికే ఉన్న తెలంగాణ తల్లి విగ్రహం బదులు కొత్త విగ్రహం పెట్టడం ఏమిటని బీఆర్ఎస్ దుయ్యబడుతోంది. ఒకే రోజు ఒకే సమయంలో అధికార ప్రతిపక్ష పార్టీలు రెండు వేరువేరు తెలంగాణ తల్లి విగ్రహాలను ఆవిష్కరించనున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సచివాలయంలో కొత్త తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరిస్తుంటే… అదే సమయానికి మేడ్చల్ జిల్లా కార్యాలయంలో కేటీఆర్ పాత తెలంగాణ తల్లి విగ్రహాన్ని పునరావిష్కరించనున్నారు.
సోనియా గాంధీ పుట్టినరోజు, ఏడాది ప్రజాపాలన సంబురాల ముగింపు కలిపి డిసెంబర్ 9న పెద్దఎత్తున ఉత్సవాలు చేసేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం సిద్ధమైంది. అటు ఉత్సవాలతో పాటు తెలంగాణ తల్లి విగ్రహాన్ని సైతం ఆవిష్కరించనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్వయంగా ప్రకటించారు. సెక్రటేరియట్‌లో తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటయ్యే స్థలానికి ఆగస్టు 8 న భూమి పూజ కూడా చేశారు. విగ్రహం చుట్టూ అదనపు హంగులను కూడా ఏర్పాటు చేస్తోంది ప్రభుత్వం. రాత్రి లేజర్ లైట్ల వెలుగులు విరజిమ్మేలా విగ్రహం చుట్టూ పెద్ద ఫౌంటెన్ ఏర్పాటు చేస్తున్నారు.
ఇక, బీఆర్‌ఎస్ పార్టీ తెలంగాణ తల్లి విగ్రహ నమూనాపై తీవ్రమైన అభ్యంతరాలు లేవనెత్తుతోంది. కాంగ్రెస్ ఆవిష్కరిస్తున్న విగ్రహం సవతి తల్లిదని… అసలైన తెలంగాణ తల్లి విగ్రహం తమదని చెబుతున్నారు బీఆర్ఎస్ నేతలు. తెలంగాణ మహిళా సమాజాన్ని అవమానించే విధంగా రేవంత్ రెడ్డి కొత్త రూపంలో ఓ విగ్రహాన్ని తయారు చేశారని, ఓవైపు భరతమాత ఫోటో, తెలుగు తల్లి విగ్రహం నగలు కిరీటాలతో ఉంటే తెలంగాణ తల్లి విగ్రహం పేదరికంలో చూపించడం తెలంగాణ మహిళా సమాజాన్ని అవమానించడమే అంటున్నారు. పక్కనున్న తెలుగు తల్లి విగ్రహం నగలు, కిరీటంతో ఉంటే, తెలంగాణ తల్లి విగ్రహం మాత్రం పేదరికంలో కనబడాలా..? అని ప్రశ్నిస్తున్నారు. తెలంగాణ తల్లి విగ్రహం 14 ఏళ్ల ఉద్యమ కాలంలో తెలంగాణ ప్రజలు ఆమోదించిన విగ్రహం అని ఇప్పుడు రేవంత్ రెడ్డి కొత్తగా విగ్రహాన్ని తీసుకొచ్చి వివాదం చేస్తున్నారని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు.
కాంగ్రెస్ మాత్రం ఇప్పటివరకు ఉన్న తెలంగాణ విగ్రహం హంగు ఆర్భాటాలతో, నగలు కిరీటాలతో, వడ్డాణం పెట్టుకుని ఉండడాన్ని తప్పు పడుతున్నారు. ఈ విగ్రహం ఓ దొరసాని మాదిరిగా ఉందని సామాన్య తెలంగాణ మహిళను గుర్తుచేసేలా కొత్త తెలంగాణ విగ్రహాన్ని మేము రూపొందించామని కాంగ్రెస్ పార్టీ చెబుతోంది. ఇక మంత్రి కొండా సురేఖ ఏకంగా ఒక అడుగు ముందుకు వేశారు. బంగారు అభరణాలు, వడ్డానాలు పెట్టి తెలంగాణ తల్లిని గతంలో దొరసానిలాగా.. కవితలాగా తయారు చేశారని ఆరోపించారు. తమ ప్రభుత్వం సబ్బండ వర్గాల ప్రతినిధిగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని తయారు చేసిందని చెప్పుకొచ్చారు.