కారిడార్ కోసం క‌స‌ర‌త్తు

Kagaz Nagar is an exercise for the Tiger Corridor: మ‌హారాష్ట్ర నుంచి ఇక్క‌డ‌కు వ‌స్తున్న పులులు ఇటు వైపే ఉండాలంటే ఏం చేయాలి..? క‌వ్వాల టైగ‌ర్ జోన్(Kawal Tiger Zone) వెళ్లాలంటే ఎలాంటి చ‌ర్య‌లు తీసుకోవాలి…? పులులు ఇక్క‌డే శాశ్వ‌త ఆవాసం ఏర్పాటు చేసుకునేలా ఏ ప్రణాళిక‌లు రూపొందించాలి…? పులుల ఆవాసానికి ఆటంకంగా మారుతున్న ప‌రిస్థితులు ఏంటి..? ఇలా అట‌వీ శాఖ అధికారులు పెద్ద ఎత్తున క‌స‌ర‌త్తు చేస్తున్నారు. మ‌హారాష్ట్ర నుంచి వ‌చ్చే పులులు క‌వ్వాల్ వెళ్లేలా కారిడార్ ఏర్పాటుకు రంగం సిద్ధం చేస్తున్నారు. కాగజ్‌నగర్‌ అడవుల్లో మూడు రోజుల పాటు పీసీసీఎఫ్‌ డోబ్రివాల్‌ పర్యటించడం ఈ వాద‌న‌కు బ‌లం చేకూర్చుతోంది.

కాగ‌జ్ న‌గ‌ర్ టైగ‌ర్ జోన్ ఏర్పాటు చేసేందుకు అధికారులు క‌స‌ర‌త్తు చేస్తున్నారు. మహారాష్ట్ర అడవుల్లో నుంచి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కవ్వాల్ అభయారణ్యంలోకి వచ్చి వెళ్తున్న పులులు ఇక్కడే శాశ్వత ఆవాసం ఏర్పాటు చేసుకుని ఉండిపోయేలా అటవీ శాఖ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా కవ్వాల్ నుంచి తాడోబా టైగర్ జోన్ వ‌ర‌కు ప్రత్యేక కారిడార్ ఏర్పాటుకు అధికారులు ప్రణాళికలు రూపొందించారు. కవ్వాల్- తాడోబా అడవుల మధ్య కంటిన్యూటీ లేకపోవడం, ఈ రెండింటి మధ్యలో పంట పొలాలు, గ్రామాలు ఉండటంతో పులుల ఆవాసానికి ఆటంకంగా మారుతున్నట్లు గుర్తించారు. ఉమ్మ‌డి ఆదిలాబాద్ జిల్లాలో కవ్వాల్ టైగర్ జోన్ ఉన్నా, కొన్ని ఏరియాల్లోకి మాత్రం పులులు అడపాదడపా వచ్చిపోతున్నా.. ఆవాసం ఏర్పాటు చేసుకోవడం లేదు. కొద్ది రోజులు సంచరించి తిరిగి వెళ్లిపోతున్నాయి.

అందుకే పులులు ఇక్కడే శాశ్వత ఆవాసం ఏర్పాటు చేసుకుని ఉండిపోయేలా అటవీశాఖ అధికారులు ప్రత్యేక వ్యూహంతో ముందుకెళ్తున్నారు. అడవిలో సాధారణంగా ఎలాంటి అలజడి, జన సంచారం లేని ప్రాంతాల్లోనే పులులు ఆవాసం ఏర్పర్చుకుంటాయి. దట్టమైన పచ్చిక బయళ్లు, వెదురు నిల్వలు కూడా ఉండాలి. సంచారానికి అనుకూలంగా ఉండటంతో పాటు సమృద్ధిగా ఆహారం లభించే ప్రాంతాల్లోనే పులులు ఆవాసం ఏర్పాటు చేసుకొని నివసిస్తాయని అధికారులు చెబుతున్నారు. కవ్వాల్ అభ్యయారణ్యం మంచిర్యాల, జన్నారం, చెన్నూరు, బెల్లంపల్లి, ఆసిఫాబాద్, కాగజ్ నగర్, ఖానాపురం, ఉట్నూరు, తదితర ప్రాంతాల వరకు మొత్తం 1.21 లక్షల హెక్టార్లలో విస్తరించి ఉంది. సిర్పూర్ కాగజ్ న‌గ‌ర్‌ కారిడార్ ఏర్పాటు చేసినా ఎలాంటి చర్యలు చేపట్టలేదు. పులులు ఉండేలా అనువైన వసతులు కల్పించలేదు. కాగ‌జ్ న‌గ‌ర్ టైగర్ జోన్ కు 130 కిలో మీటర్ల దూరంలో తాడోబా, 230 కిలో మీటర్ల దూరంలో తిప్పేశ్వర్, కడంబా టైగర్ జోన్లు ఉంటాయి.

పులులకు ఆహారం దొరకపోవడం, ఆవాసానికి సరైన వాలావరణం లేకపోవడం, పులుల సంఖ్య పెరిగిపోవడంతో ఇతర ప్రాంతాలకు వలస వస్తుంటాయని అధికారులు పేర్కొంటున్నారు. నిరొంచ గడ్చిరోని, యవత్మాల్ తదితర ప్రాంతాల నుంచి కూడా పులులు వస్తున్నట్లు గుర్తించారు. ప్రస్తుతం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎనిమిది పులులు సంచరిస్తున్నాయి. అవి తాడోబా కడంబా తిప్పేశ్వరం టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ నుంచి రాకపోకలు సాగిస్తున్నాయి. కొద్ది రోజుల కింద‌ట మహారాష్ట్రలోని తిప్పేశ్వర్ పులుల సంరక్షణ కేంద్రంలో మంచిర్యాల అటవీశాఖ అధికారులు పర్యటించారు. అక్కడి నుంచి తరలించిన పలు గ్రామాల గిరిజనులకు కల్పించి ఉద్యోగ, ఉపాధి అవకాశాలపై అధ్యయనం చేశారు. తిప్పేశ్వర్ అభ్యయారణ్యంలో చేపట్టిన పనులను సైతం పరిశీలించారు.

అలాగే కవ్వాల పులుల సంరక్షణ కేంద్రం తిప్పేశ్వర పులుల సంరక్షణ కేంద్రానికి తేడాను గమనించారు. పులుల సంరక్షణకు తిప్పేశ్వర్లో తీసుకుంటున్న చర్యలు, కవ్వాల్ లో చేపట్టాల్సిన పనులపై అటవీ శాఖ అధికారులు నోట్ సిద్ధం చేసి, దాని ప్రకారం ముందుకెళ్తున్నట్టు తెలిసింది. పులులు దాడులు చేసిన ప్రాంతాల్లో ప‌శువుల‌కు ఇచ్చే ప‌రిహారం పెంచ‌డం, అది కూడా వెంట‌నే ఇవ్వ‌డంలాంటి చ‌ర్య‌లకు అధికారులు సిఫార‌సు చేశారు. దాడిలో మ‌నుషులు మ‌ర‌ణిస్తే ఇప్పుడు ఇస్తున్న ప‌రిహారం కూడా మ‌హారాష్ట్రలో మాదిరిగా రెట్టింపు చేయ‌డం ఇలా ప‌లు అంశాల‌పై అధికారులు చ‌ర్చించారు. ఎట్టి ప‌రిస్థితుల్లో ఇటు వ‌స్తున్న పులులు ఇక్క‌డే ఉండేలా అధికారులు పూర్తి స్థాయిలో ప్ర‌ణాళిక‌లు రూపొందిస్తున్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like