సింగిల్ డిజిట్‌కు చేరిన ఉష్ణోగ్రతలు
TS Weather : తెలంగాణ, ఆంధ్రాలో చలి వణికిస్తోంది. తెలంగాణలో చలి పులి చంపేస్తోంది. రోజురోజుకు ఉష్ణోగ్రతలు క్రమంగా పడిపోతున్నాయి. రెండు రోజులుగా సింగిల్ డిజిట్‌కే పరిమితం అవుతున్నాయి. ముఖ్యంగా రాత్రుళ్లు చలి ఇబ్బంది పెడుతుంది. శీతలగాలులు ఇదే విధంగా కొనసాగితే పిల్లలు, వృద్ధులు అనారోగ్యం బారిన పడే అవకాశం ఉందంటున్నారు వైద్యులు. ఆదిలాబాద్, కుమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్ జిల్లాలో అత్యల్ప ఉష్ణోగ్రతలు రికార్డవుతున్నాయి. ఆదిలాబాద్ జిల్లా బేలలో 7 డిగ్రీలు, కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ టిలో 7.3 డిగ్రీలు, నిర్మల్ జిల్లా పెంబిలో 8.3 డిగ్రీలు, మంచిర్యాల జిల్లా తపాల్‌పూర్ 10.8 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. ఇక తెలంగాణ అంతటా ఇదే పరిస్థితి నెలకొంది. మెదక్ జిల్లా శివంపేటలో 9.4 డిగ్రీలు, సంగారెడ్డి జిల్లా నల్లపల్లిలో 9.7 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
హైదరాబాద్‌లోనూ ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయాయి. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో శీతల గాలుల ప్రభావం పెరిగింది. కొద్ది రోజులు ఇదే విధంగా చలి తీవ్రత కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఉత్తర, ఈశాన్య దిశ నుంచి వీస్తున్న గాలుల కారణంగా చలి ప్రభావం అధికంగా ఉందని తెలిపారు. చలికితోడు పొగ మంచు కూడా కమ్మేయడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతంలో ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోయాయి. చలికి తోడు పొగమంచుతో కూడా జనం ఇబ్బందులు పడుతున్నారు.