రైతుకు బేడీలు.. సీఎం సీరియస్..
Telangana: ఓ రైతుకు బేడీలు వేసిన ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. సంగారెడ్డి జైల్లో ఉన్న హీర్యా నాయక్ అనే రైతు అనారోగ్యం బారిన పడ్డాడు. దీంతో పోలీసులు అతడిని ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే, తీసుకెళ్లే క్రమంలో రైతు చేతికి బేడీలు వేసి తీసుకెళ్లడం అనేది వివాదాస్పదంగా మారింది. దీంతో సీఎం తీవ్రంగా స్పందించారు. అసలు రైతుకు బేడీలు వేయాల్సిన అవసరం ఏమొచ్చిందని పోలీసు అధికారులను ప్రశ్నించారు. దీనిపై పూర్తి నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.
వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గం దుద్యాల మండలం లగచర్ల, పోలేపల్లిలో ఇండస్ట్రీయల్ కారిడార్ ఏర్పాటుపై ప్రజాభిప్రాయ సేకరణ కోసం వెళ్లిన కలెక్టర్ ప్రతీక్ జైన్‌పై గ్రామస్తులు దాడికి పాల్పడం సంచలనంగా మారింది. కలెక్టర్‌పై దాడికి పాల్పడిన కొందరు లగచర్ల రైతులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారిలో రైతు హీర్యానాయక్ ఒకరు. ఆయన కంది సెంట్రల్ జైలులో ఉన్నాడు. అయితే హీర్యాకు ఛాతిలో నొప్పి రావడంతో అతడిని జైలు అధికారులు సంగారెడ్డి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఆస్పత్రికి తీసుకువస్తున్న సమయంలో హీర్యా నాయక్ చేతికి బేడీలు ఉన్నాయి. బేడీలతోనే హీర్యానాయక్‌ను పోలీసులు సంగారెడ్డి ఆస్పత్రికి తీసుకొచ్చారు. అవే బేడీలతో రైతుకు చికిత్స అందించారు. ఈ ఘటనతో ప్రతిపక్షాలు ప్రభుత్వంపై దుమ్మెత్తిపోశాయి. అన్నం పెట్టే రైతుకు, అనారోగ్యంతో ఉన్న రైతుకు ఇలా బేడీలు వేసి ఆసుపత్రికి తీసుకెళ్లడం దారుణం అన్నారు. బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు.
దీనిపై సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) సీరియస్ అయ్యారు. రైతుకు బేడీలు వేసిన ఘటనపై తీవ్రంగా స్పందించారు. ప్రజా పాలనలో రైతుకు బేడీలు వేసి తీసుకెళ్లాల్సినంత అవసరం ఏమొచ్చిందన్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న రైతును ఆసుపత్రికి తీసుకెళ్లే సమయంలో జాగ్రత్తలు ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు. దీనిపై అధికారులను ఆరా తీశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. రైతులను అవమానించినా, వారి చేతులకు బేడీలు వేసినా ప్రభుత్వం సహించదని ముఖ్యమంత్రి రేవంత్ తేల్చి చెప్పారు. ఈ ఘటనపై సమగ్ర నివేదికను ఇవ్వాలని పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.