జర్నలిస్టులను కొట్టాలని దైవసాక్షిగా అనుకోలేదు
![](https://naandinews.com/wp-content/uploads/2024/12/Mohan_Babu-1-750x430.jpg)
Mohan Babu On Media Attack: జర్నలిస్టులను కొట్టాలని తాను దైవసాక్షిగా అనుకోలేదని సినీనటుడు మోహన్ బాబు తెలిపారు. మొదట తాను జర్నలిస్టుకు నమస్కారం పెట్టానని, అయినా అతను తన వద్ద మైక్ పెట్టారని అన్నారు. ఆ మైక్ తన కన్నుకు తగలబోయిందని, తృటిలో తాను తప్పించుకున్నట్లు చెప్పారు. రెండు రోజులు ఆసుపత్రిలో ఉన్నా ఆయన ఇవాళ డిశ్చార్జ్ అయిన వెంటనే మీడియాపై దాడిని ఉద్దేశిస్తూ ఆడియో సందేశం విడుదల చేశారు. దాడి చేయడం తన తప్పేనని, తన ఆవేదనను అర్ధం చేసుకోవాలని కోరారు. మైకులు లాక్కుని కొట్టేంత మూర్ఖుడిని తాను కాదన్నారు. గాయపడ్డ జర్నలిస్ట్ తన కుటుంబంలో ఒకరిని, తమ్ముడు లాంటి వారని అన్నారు. జరిగిన ఘటనకు బాధపడుతున్నానని తెలిపారు. అతని భార్యాపిల్లలు ఎంత బాధపడుతున్నారో అని తాను ఆలోచిస్తున్నట్లు చెప్పారు.
ఈ సందర్భంగా మీడియాపై కూడా ప్రశ్నల వర్షం కురిపించారు. ఇతరుల కుటుంబ సమస్యల్లో ఎవరైనా జోక్యం చేసుకోవచ్చా? అని ప్రశ్నించారు. ప్రజలు, నాయకులు దీనిపై ఆలోచించాలన్నారు. నాలుగు రోజులుగా పత్రికా ఛానళ్లు, విలేకర్లు తన ఇంటి ముందు లైవ్ వ్యాన్లు పెట్టుకుని ఉండటం ఎంతవరకూ సబబని ప్రశ్నించారు. ఈ ఘటనలో తాను దాడి చేశానని చెప్తున్నారే కానీ, సదరు జర్నలిస్ట్ తన నోట్లో మైక్ పెట్టిన విషయాన్ని ఎవరూ ప్రశ్నించడం లేదని మోహన్ బాబు అన్నారు. మైక్ తెచ్చి తన కన్ను దగ్గర పెట్టారని.. కాసింతయ్యి ఉంటే తన కన్ను పోయేదని అన్నారు. తాను దండంపెట్టి చెప్పినా వినిపించుకోలేదన్నారు. ఒక రాజ్యసభ సభ్యుడిగా తాను క్లీన్ చిట్ గా ఉన్నానని అన్నారు. వచ్చిన వాళ్లు మీడియా వాళ్లా? వేరే వాళ్ల అనేది తనకు తెలియదని మోహన్ బాబు అన్నారు
విజయవాడలో తాను ఒకపప్పుడు ఉద్యోగినేనని గుర్తు చేశారు. తన ఇంటికి వచ్చినవారు మీడియా వారా..? వేరే వారు ఎవరైనా వచ్చారా..? అనే విషయం తనకు తెలియదన్నారు. జరిగిన సంఘటనకు తాను మనస్ఫూర్తిగా చింతిస్తున్నట్లు తెలిపారు. అన్ని విషయాలను పైన భగవంతుడు చూస్తున్నారని మోహన్ బాబు తెలిపారు. తాను ఎన్నో సేవా కార్యక్రమాలు చేశానని, తాను చేసిన మంచి పనులను ఎవరూ అర్థం చేసుకోవడంలేదన్నారు. జర్నలిస్టులను కొట్టడం మాత్రం తప్పే అయినా.. సందర్భాన్ని అర్థం చేసుకోవాలని మోహన్‌బాబు పేర్కొన్నారు. పోలీసులంటే తనకు ఎంతో ఇష్టమని, వారు శాంతి భద్రతలను కాపాడాలన్నారు. కొందరు పోలీసులు ఏకపక్షంగా వ్యవహారిస్తున్నారని మోహన్‌బాబు తెలిపారు. ఇది న్యాయమా.. అన్యాయమా అనేది ఆలోచించాలన్నారు.