వరల్డ్ చెస్ ఛాంపియన్‌గా తెలుగుతేజం

World Chess Champion : ఎవరూ ఊహించని విజయాన్ని ఓ తెలుగు కుర్రాడు సాధించాడు. 18 ఏళ్ల దొమ్మరాజు గుకేష్ అనే చెస్ ఛాంపియన్ ఇప్పుడు వరల్డ్ చెస్ ఛాంపియన్ గా నిలిచాడు. ప్రపంచ చెస్ ఛాంపియన్‌షిప్‌లో చివరి గేమ్ 14వ రౌండ్లో చైనీస్ డిఫెండింగ్ చాంపియన్ డింగ్ లిరెన్‌ను గుకేష్ ఓడించాడు. క్రీడా చరిత్రలో అత్యంత చిన్న వయసులోనే వరల్డ్ చెస్ ఛాంపియన్‌ అవార్డు గెలిచి చరిత్ర సృష్టించాడు.

సింగపూర్‌లో జరిగిన ఫిడే ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ పోటీలో డింగ్‌ లిరెన్‌, గుకేశ్‌ మధ్య గట్టి పోటీనే జరిగింది. వీరిద్దరి మధ్య బుధవారం జరిగిన 13వ రౌండ్‌లోనే ఫలితం తేలాల్సి ఉంది. కానీ ఇద్దరూ ఒకరి ఎత్తులను మరొకరు చిత్తు చేస్తూ దాదాపు 5 గంటల పాటు ఉత్కంఠగా పోటీ పడ్డారు. అయినప్పటికీ ఇద్దరూ చెరో 6.5 పాయింట్లతో సమానంగా పోటీ పడ్డారు. దీంతో 68 ఎత్తుల తర్వాత ఇద్దరు ఆటగాళ్లు ఫలితం తేలకుండానే గేమ్‌ ముగించేందుకు అంగీకరించారు. ఇవాళ జరిగిన చివరి క్లాసికల్‌ గేమ్‌లో డింగ్‌ లిరెన్‌ 6.5 పాయింట్లు సాధించగా.. గుకేశ్‌ 7.5 పాయింట్లు స్కోర్‌ చేసి విజేతగా నిలిచాడు.

7 ఏళ్ల వయసు నుంచే చెస్ ఆటపై ఆసక్తి పెంచుకున్న గుకేష్ 18ఏళ్లకే వరల్డ్ చెస్ ఛాంపియన్‌గా అరుదైన ఘనత సొంతం చేసుకున్నాడు. గత 36 ఏళ్లలో ఈ రికార్డు నెలకొల్పింది గుకేష్ ఒక్కరే. గుకేష్ స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పు గోదావరి జిల్లా. తల్లిదండ్రులు రజనీకాంత్ పద్మ. గుకేశ్‌ పెరిగింది తమిళనాడులోని చెన్నైలో అయినా అతని స్వస్థలం ఏపీలోని తూర్పు గోదావరి జిల్లా. గుకేశ్‌ తండ్రి రజినీకాంత్‌ సర్జన్.

Get real time updates directly on you device, subscribe now.

You might also like