జైలర్ పై సస్పెన్షన్ వేటు

Sangareddy District Jailer Suspension:
లగచర్ల రైతుకు బేడీలు వేసిన ఘటనలో సంగారెడ్డి జైలర్ సంజీవరెడ్డిని సస్పెండ్ చేస్తూ జైళ్లశాఖ డిజి సౌమ్య మిశ్రా ఆదేశాలు జారీ చేశారు. విధి నిర్వహపణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన సంగారెడ్డి జైలు సూపరింటెండెంట్‌ సంతోష్‌ కుమార్ రాయ్‌పై శాఖ పరమైన చర్యలు చేపట్టాలని జైళ్లశాఖ డీజీ హోం శాఖ స్పెషల్‌ సీఎస్‌ కు విజ్ఞప్తి చేశారు. గిరిజన రైతును బేడీలతో ఆస్పత్రికి తీసుకెళ్లిన ఘటనపై జైళ్ల శాఖ డీజీ విచారణ జరిపి ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. లగచర్లలో ఫార్మా విలేజ్‌ భూసేకరణకు వ్యతిరేకంగా కలెక్టర్‌ పై దాడి కేసులో హీర్యా నాయక్‌ అండర్‌ ట్రయల్‌ ఖైదీగా సంగారెడ్డి జైలులో ఉన్నారు.

ఈ ఘటనపై ఐజి సత్యనారాయణ విచారణలో పలు సంచలన విషయాలు బయటపడ్డాయి. విచారణ ఖైది హీర్యా నాయక్‌ను లగచర్ల రైతుగా పేర్కొనకుండా బాలానగర్ పోలీసుస్టేషన్ పరిధిలోని ఒక కేసులో నిందితుడిగా చూపడం వల్లనే అతనికి బేడీలు వేసినట్లు బయటపడిందని ఐజి తెలిపారు. ఈ ఘటనలో జైలు అధికారుల తప్పిదం అడుగడుగునా కనిపించిందన్నారు.

గుండెనొప్పి అని చెబితే బెయిల్ వస్తుందని హీర్యా నాయక్‌కు లగచర్ల ఘటనలో ఎ2 నిందితుడు సురేష్ తప్పుదోవ పట్టించినట్టు తేలిందని ఐజి తెలిపారు. సురేష్ ఇంకా ఎవరెవరితో మాట్లాడిన విషయంపై ఆరా తీస్తున్నామని తెలిపారు. జైలు అధికారులు ఉద్దేశపూర్వకంగా పొరపాటు చేశారా? లేక పొరపాటుగా జరిగిందా? అనే కోణంలో విచారణ జరపగా విషయాలు బయటపడ్డాయన్నారు. విచారణ ఖైదీలను ఆసుపత్రికి తీసుకెళ్లే సమాచారాన్ని అటు వికారాబాద్ పోలీసులకు గానీ, సంగారెడ్డి పోలీసులకు గానీ సమాచారం ఇవ్వకుండా సైబరాబాద్ పోలీసులకు తెలియజేయడం వెనుక కుట్ర ఏమైనా ఉందా? అనే కోణంలో విచారణ జరిపినప్పుడు ఇవి బయటకు వచ్చాయని ఐజి సత్యనారాయణ వెల్లడించారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like