250 మంది మావోయిస్టులు మృతి
250 Maoists were killed: ఖాకీలు దూరని కారడవి… శాటిలైట్లు దూరని చిట్టడివి… శత్రు దుర్భేధ్యంగా.. మావోయిస్టు పార్టీకి పెట్టని కోటలా ఉన్న దండకారణ్యం… ఇప్పుడు నెత్తురోడుతోంది. అన్నలకు కోటగా ఉన్న దండకారణ్యంలోకి ఖాకీలు చొచ్చుకువెళ్తుండటంతో వరుసగా ఎన్‌కౌంటర్లు జరుగుతున్నాయి. గతంలో ఎన్నడూ చూడని ప్రాణనష్టాన్ని మావోయిస్టు పార్టీ చవిచూస్తోంది. ఈ ఏడాది కాలంలో దాదాపు 250 మంది ప్రాణాలు కోల్పోయారంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. ఒక్క బస్తర్ డివిజన్ లోనే ఇప్పటి వరకు 217 మంది మావోయిస్టులు మృత్యువాత పడ్డారు.
92,200 చదరపు కిలో మీటర్ల అటవీ విస్తీర్ణం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్‌ఘడ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాల మధ్య దేశంలోనే దట్టమైన అడవులకు నిలయం. ఈ దండకారణ్యంలోని అబూజ్‌మడ్ కొండ ప్రాంతం నిలయం. దీంతోపాటుగా వందల కిలోమీటర్ల మేర విస్తరించిన తూర్పు కనుమలు, దండకారణ్యాన్ని శత్రు దుర్భేద్యంగా సహజసిద్ధంగా మలచిందని చెప్పొచ్చు. సుమారుగా ఉత్తరదక్షిణాలు ఐదొందల కిలోమీటర్లు, తూర్పు పడమరలు మూడొందల కిలోమీటర్ల మేర విస్తరించిందంటే ఈ అరణ్యం ఎంత విస్తారమైనదో అంచనా వేసుకోవచ్చు. శాటిలైట్ కెమెరా కన్నులకు కూడా అందనంత దట్టంగా అల్లుకుపోయిన ఈ దండకారణ్యంలో మావోయిస్టులు, ఈ ప్రాంతంలోని అధిక సంఖ్యాకులైన ఆదివాసులను ఆకట్టుకుని ప్రభుత్వాలకు సవాల్ విసిరారు. దశాబ్దాలుగా అటు కేంద్రం, ఇటు రాష్ట్రాలు ఎంతగా ప్రయత్నాలు చేసినా మావోయిస్టులను నిలువరించలేకపోయారు. నక్సల్బరీ ఉద్యమం నుంచి ఈ ప్రాంతంలో ఏదో ఒక మూలన ఉనికి చాటుకున్న తీవ్రవాదం, అనంతర కాలంలో మావోయిస్టు ఉద్యమానికి కేంద్ర స్థానంగా మారింది. దేశంలో కార్యకలాపాలకు అబూజ్‌మడ్ వేదికైంది.
వరుస ఎన్కౌంటర్లతో తీరని నష్టం..
మావోయిస్టు పార్టీ వరుస ఎన్కౌంటర్లతో తీరని నష్టాన్ని చవి చూస్తోంది. మరీ ముఖ్యంగా ఈ ఏడాది ఇప్పటి వరకు దాదాపు 250 మంది మావోయిస్టులు నేలకొరిగారు. ఒక్క బస్తర్ డివిజన్‌లోనే 13 డిసెంబర్ 2023 నుండి 12 డిసెంబర్ 2024 వరకు 217 మంది చనిపోయినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఏడాది దాదాపు ఐదు పెద్ద ఎన్‌కౌంటర్లు జరగ్గా చత్తీస్‌ఘడ్‌లో దాదాపు 30 మంది మావోయిస్టులు ఒకే ఎన్‌కౌంటర్‌లో మృత్యువాత పడ్డారు. 2016లో ఏవోబీలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో 27 మంది మావోయిస్టులు చనిపోయారు. ఆ తర్వాత ఇదే పెద్ద ఎన్‌కౌంటర్. ఛత్తీస్‌ఘడ్‌లో 2008లో జరిగిన ఎన్‌కౌంటర్ తర్వాత ఇదే అతిపెద్దదని సీఆర్పీఎఫ్ వర్గాలు వెల్లడించాయి. ఇలా ఈ ఏడాది మావోయిస్టులకు భారీ ప్రాణ నష్టం సంభవించింది. తాజాగా దక్షిణ అబుజ్‌మడ్‌లో నిన్న జరిగిన ఎన్‌కౌంటర్‌లో సైతం దాదాపు ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. గతంలో అడుగుపెట్టడానికి కూడా సంకోచించే భద్రతా బలగాలు యథేచ్ఛగా ఆ ప్రాంతానికి వెళ్లి మావోయిస్టులను మట్టుబెడుతున్నారు.
ప్రతికూల పరిస్థితుల్లో కుదేలు..
మావోయిస్టు పార్టీ ఇప్పుడు ప్రతికూల పరిస్థితులనే ఎదుర్కొంటోంది. మరీ ముఖ్యంగా పార్టీలో ఎన్నో సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయి. మావోయిస్టు పార్టీ ప్రస్తుతం ఆత్మరక్షణ పంథాలో ఉన్నట్టు చెబుతున్నారు. ఏడాదికి పైగా ఎలాంటి రిక్రూట్‌మెంట్లు లేకపోవడం, ఉద్యమంలోకి కొత్త రక్తం నింపలేకపోవడం, వరుస వైఫల్యాలు, అరెస్టులు, లొంగుబాట్లు, వ్యాధులు చుట్టుముట్టి ఉద్యమం నిర్వీర్యం అవుతోందని నిఘా వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. నిఘా వర్గాలు మావోయిస్టు కోటలో ప్రతి రోజు ఏం జరుగుతోంది..? అగ్రనేతలను ఎవరెవరు కలుస్తున్నారు..? సానుభూతిపరులు, పట్టణాల్లో ఉండి పనిచేస్తున్న వారు.. ఇలా ఎవరెవరు ఎలా పనిచేస్తున్నారనే విషయాన్ని గుర్తిస్తున్నారు. టెక్నాలజీ పెద్ద ఎత్తున వాడి మావోయిస్టు నేతలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. డ్రోన్ల సాయంతో వారి ఉనికి గుర్తించి బలగాలతో విరచుకుపడుతున్నారు. కొద్ది నెలలుగా మావోయిస్టులకు అందుతున్న సరఫరా వ్యవస్థలను నిర్వీర్యం చేయడంలో పోలీసులు విజయం సాధించారు. మందులు, ఇతర చికిత్సలకు అవసరమైన పరికరాలు, నిత్యావసరాలు, డబ్బు సరఫరాపై నిఘాను తీవ్రతరం చేసిన పోలీసులు, వారపు సంతల్లో మకాం వేసి ఎవరు ఏమేం తీసుకుంటున్నారు..? మందులు ఎందుకు కొంటున్నారన్న సమాచారాన్ని సేకరించింది. దీంతో దీర్ఘకాలికంగా వారపు సంతలే సరఫరా మార్గాలుగా ఉన్న పరిస్థితి ఒక్కసారిగా మారింది. దీంతో గిరిజన గూడేలను ఆసరా చేసుకున్నా.. అక్కడా నిఘా పెరిగింది.
2026 వరకు మావోయిస్టు పార్టీని లేకుండా చేస్తామని కేంద్ర ప్రభుత్వం చెప్పడమే కాకుండా ఆపరేషన్ కగార్ పేరుతో ముందుకు సాగుతోంది. అన్నట్లుగానే వారిపై నిర్బంధం పెంచి ఎన్‌కౌంటర్లు చేస్తోంది. అయితే, మావోయిస్టు పార్టీ వ్యూహాత్మక మౌనం పాటిస్తోందా..? లేక మావోయిస్టు పార్టీ నేతలు మరేదైనా ఎత్తుగడలు వేసేందుకు వ్యూహరచన చేస్తున్నారా..? నిజంగానే ఒత్తిళ్లతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారా..? వరుస ఎన్‌కౌంటర్లతో అబూజ్‌మఢ్ నెత్తురోడుతున్న సమయంలో మావోయిస్టులు అగ్రనేతలు ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది ప్రశ్నార్థకంగా మారింది.