తండ్రి త్యాగం… కొడుకు విజయం..
World Chess Championship: 18 ఏండ్లకే ప్రపంచ విజేత.. అత్యంత పిన్న వయస్కుడిగా రికార్డు.. చెస్ చరిత్రలో తనకంటూ ఒక పేజీ… ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో.. మరెన్నో ఇదంతా వరల్డ్ చెస్ ఛాంపియన్‌షిప్ గెలిచిన గుకేష్ గురించే.. ఆయన సాధించిన ఘనత అంతా ఇంతా కాదు.. గురువారం జరిగిన చివరి రౌండ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్, చైనా గ్రాండ్‌మాస్టర్ డింగ్ లిరెన్‌ను ఓడించి కొత్త చరిత్ర సృష్టించాడు. 18 ఏళ్ల, 8 నెలల, 14 రోజుల వయసులో గుకేశ్ చెస్ లో విశ్వవిజేతగా అవతరించాడు. ఈ రికార్డు గారీకాస్పరోవ్ పేరిట ఉండేది. అతను 22 ఏళ్ల 6 నెలల 27 రోజుల వయసులో ప్రపంచ చాంపియన్‌గా నిలిచాడు. దాని మన గుకేష్ తిరగరాశాడు.
అయితే, ఆయన విజయం వెనక ఆయన తల్లిదండ్రుల పాత్ర ఎంతో ఉంది. ముఖ్యంగా తండ్రి రజనీకాంత్ పాత్ర ఖచ్చితంగా చెప్పుకోవాల్సిందే. ఆయన ఈఎన్‌టీ సర్జన్.. చిన్నతనం నుంచే గుకేశ్కు చెస్ పట్ల ఆసక్తి ఏర్పడింది. దానిని గమనించిన తండ్రి ఆయనను ఎంతో ప్రోత్సహించారు. గుకేశ్ వెంటే ఉండేవాడు. గుకేశ్ కెరీర్ కోసం ఆరేళ్ల కిందట తండ్రి తన ప్రాక్టీస్ సైతం వదిలేశాడు. వెన్నంటే ఉంటూ విజయం వైపు నడిపించాడు. చెస్ చాంపియన్ గా అవతరించిన వెంటనే గుకేశ్ భావోద్వేగానికి గురయ్యాడు. తన తండ్రి రజినీకాంత్‌ను హత్తుకుని ఏడ్చేశాడు. గుకేశ్ విజయంలో దిగ్గజ చెస్ ప్లేయర్ విశ్వనాథన్ ఆనంద్ కృషి కూడా ఉంది. ఒక మెంటార్ గా గుకేశ్ ను విశ్వనాథన్ ఆనంద్ తీర్చి దిద్దాడు. వరల్డ్ చెస్ ఛాంపియన్‌గా నిలిచిన రెండో భారతీయుడిగా గుకేశ్ నిలవడం విశేషం. విశ్వనాథన్ ఆనంద్ భారత్ తరఫున ఈ టైటిల్ మొదటిసారి నెగ్గాడు. తర్వాత టైటిల్ గెలిచిన భారతీయుడు గుకేశ్. విశ్వనాథన్ ఆనంద్ ఐదుసార్లు ఈ టైటిల్ సాధించాడు.
ప్రపంచ చెస్ చాంపియన్ గుకేశ్ తెలుగు మూలాలున్న అబ్బాయి. అతడి పూర్వీకులు ఆంధ్రప్రదేశ్ కు చెందిన వారే. తిరుపతి జిల్లా పిచ్చాటూరు మండలంలోని చెంచురాజు కండ్రిగ గ్రామానికి చెందినవారు. గుకేశ్ ముత్తాతలు అక్కడ నివసించగా.. గుకేశ్ తల్లిదండ్రులు మాత్రం చెన్నైలో స్థిరపడ్డారు. గుకేశ్ తెలుగు కూడా చక్కగా మాట్లాడగలడు.