అల్లు అర్జున్ విడుదల
Allu Arjun Release: సినీ నటుడు అల్లు అర్జున్ శనివారం ఉదయం విడుదల అయ్యారు. ఈ నెల 4న పుష్ప-2 ప్రీమియర్ షో సందర్భంగా హైదరాబాద్ సంధ్య థియేటర్‌లో జరిగిన తొక్కిసలాటలో మహిళ మృతి చెందిన కేసులో సినీ నటుడు అల్లు అర్జున్ అరెస్టు, జైలుకు తరలింపు, మధ్యంతర బెయిల్‌తో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. చిక్కడపల్లి పోలీసులు ఆయనను శుక్రవారం అరెస్ట్ చేసి, నాంపల్లి కోర్టు ఎదుట హాజరుపరిచారు. కోర్టు 14 రోజులు జ్యుడీషియల్ రిమాండ్ విధించటంతో చంచల్‌గూడ జైలుకు తరలించారు. జైల్లో ఆయనకు మంజీరా బ్యారక్ కేటాయించారు. హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇవ్వటంతో అల్లు అర్జున్ కుటుంబసభ్యులు, అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. అర్జున్ 50 వేల వ్యక్తిగత బాండ్‌ను చంచల్‌గూడ జైలు సూపరింటెండెంట్‌కు అందజేయాలని హైకోర్టు ఆదేశించింది.
శుక్రవారం రాత్రి 7 నుంచి 9 గంటల్లోపు అల్లుఅర్జున్ విడుదల అయ్యే అవకాశాలున్నాయని ప్రచారం జరిగింది. కుమారుడితో కలిసి వెళ్లేందుకు వచ్చిన అల్లు అరవింద్ రాత్రి 10 గంటలకు ఇంటిముఖం పట్టారు. ఏ సమయంలోనైనా ఆయన విడుదల కావచ్చనే సమాచారంతో చంచల్‌గూడ వద్దకు భారీగా అభిమానులు చేరుకున్నారు. బెయిల్‌కు సంబంధించిన పత్రాలు జైలు అధికారులకు రాత్రి 10 గంటలకు తర్వాత చేరటంతో చంచల్‌గూడ జైల్లోనే ఉండేందుకు ఏర్పాట్లు చేశారు. సాధారణంగా ఆలస్యంగా వచ్చిన బెయిల్ ఉత్తర్వులకు సంబంధించిన విచారణ ఖైదీలను మరుసటి రోజు విడుదల చేయటం ఆనవాయితీ. ఇదే క్రమంలో అల్లు అర్జున్ శనివారం విడుదల అయ్యారు.