దేశంలోనే అత్యుత్తమ కంపెనీగా సింగరేణి
-ఎనర్షియా ఫౌండేషన్ అవార్డు ప్రకటించిన నిర్వాహకులు
-ఈ నెల 20న విశాఖపట్నంలో ప్రదానం
-హర్షం వ్యక్తం చేసిన సంస్థ సీఎండీ ఎన్.బలరామ్
Singareni: పర్యావరణహిత సుస్థిర మైనింగ్ తో పాటు సంప్రదాయేతర విద్యుత్ రంగంలో విశేషమైన సేవలు అందిస్తున్నందుకు సింగరేణికి జాతీయ స్థాయిలో మరో ప్రతిష్టాత్మక అవార్డు దక్కింది. భారతదేశం, దక్షిణాసియాలో సుస్థిర ఇంధన, పునరుద్పాదక ఇంధన వనరులను ప్రోత్సహించడంలో అత్యుత్తమ ప్రదర్శన కనబరుస్తున్న సంస్థలను ఎనర్షియా ఫౌండేషన్ ఎంపిక చేసి ప్రతీ ఏడాది పురస్కారాలను ప్రదానం చేస్తూ ప్రోత్సహిస్తున్నారు.
ఈ ఏడాది “ఇండియాస్ బెస్ట్ అండ్ మోస్ట్ సస్టేనబుల్ కోల్ మైనింగ్ ఆపరేటర్ విత్ రెన్యూవబుల్ ఎనర్జీ అడాప్షన్” కేటగిరీలో సింగరేణిని అత్యుత్తమ సంస్థగా ఎంపిక చేశారు. ఈనెల 20న విశాఖపట్నంలో నిర్వహించే బహుమతి ప్రదానోత్సవ వేడుకలలో సంస్థకు అందచేస్తారు. పర్యావరణ హిత మైనింగ్ కు పెద్దపీట వేయటమే కాకుండా సంప్రదాయేతర ఇంధన వనరుల్లో ఒకటైన సోలార్ విద్యుత్తు ఉత్పాదన చేపట్టి విజయవంతంగా ముందుకు వెళ్తున్న సింగరేణి సంస్థను జాతీయస్థాయిలో అత్యుత్తమ సంస్థగా నిర్ణయించిందని అవార్డు కమిటీ జ్యూరీ కన్వీనర్ ఆర్.త్యాగరాజన్ అయ్యర్ పేర్కొన్నారు.
ఒడిశాలో నైనీ బొగ్గు గనికి అనుబంధంగా పర్యావరణహితంగా 1600 మెగావాట్ల అత్యాధునిక సూపర్ క్రిటికల్ థర్మల్ ప్లాంట్ చేపట్టే ప్రతిపాదన, రామగుండంలో 500 మెగావాట్ల పంప్డ్ స్టోరేజీ ప్లాంట్ ఏర్పాటుకు సిద్ధం కావడం, భారీ జలాశయాల్లో ఫ్లోటింగ్ సోలార్ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తుండటం, కార్బన్ డై యాక్సైడ్ నుంచి మిథనాల్ తయారీ తదితర చర్యలతో పర్యావరణ పరిరక్షణకు కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. సింగరేణి ఆరు కోట్లకు పైగా మొక్కలు నాటడమే కాక వాటిని వనాలుగా పెంచుతోందన్నారు. పర్యావరణహిత మైనింగ్ పద్ధతులైన సర్ఫేస్ మైనర్, కంటిన్యూయస్ మైనర్, ఇన్ పిట్ క్రషర్ అండ్ కన్వేర్ టెక్నాలజీ వంటి సాంకేతికతలను బొగ్గు ఉత్పత్తిలో వినియోగిస్తూ ఆదర్శ కంపెనీగా నిలుస్తోందన్నారు.
సింగరేణి వ్యాప్తంగా ఇప్పటికే 245 మెగావాట్ల సామర్థ్యం గల సోలార్ ప్లాంట్లను పలు ఏరియాలో ఏర్పాటు చేసి విజయవంతంగా నిర్వహిస్తోందని, తద్వారా తన థర్మల్ విద్యుత్ వినియోగాన్ని సగానికి పైగా తగ్గించుకొని పర్యావరణకు దోహదపడుతోందని కొనియాడారు. సింగరేణి థర్మల్ ప్లాంట్లో ఉత్పత్తి అయ్యే బాటమ్ యాష్, ఫ్లైయాష్‌లను సైతం పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకుంటూ పర్యావరణానికి దోహదపడుతోందని స్పష్టం చేశారు. ఎనర్షియా ప్రకటించిన ఈ జాతీయ స్థాయి అవార్డు సింగరేణి సంస్థ చేపడుతున్న పర్యావరణహిత చర్యలకు గుర్తింపు వంటిదని, సింగరేణి సంస్థ ఈ స్ఫూర్తితో తన పర్యావరణ చర్యలను మరింత సమర్థవంతంగా నిర్వహిస్తూ ముందుకు పోతుందని సంస్థ సీఎండీ బలరామ్ తన హర్షం వ్యక్తం చేశారు.